Sprouts : ప్రస్తుత కాలంలో శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, శరీరాన్ని ధృడంగా, బలంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. దీని కోసం శరీరానికి అవసరమయ్యే పోషకాలు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు కలిగిన ఆహారాల్లో మొలకెత్తిన గింజలు కూడా ఒకటి. మొలకెత్తిన గింజలను తీసుకునే వారి సంఖ్య నేటి తరుణంలో ఎక్కువైందనే చెప్పవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ తో పాటు అనేక రకాల పోషకాలు కూడా అందుతాయి. చక్కటి ఆహారాన్ని అందించడంలో మొలకలు మనకు ఎంతగానో సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. శరీరం ధృడంగా తయారవుతుంది.
జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో మలినాలు తొలగిపోయి శరీరం శుభ్రపడుతుంది. ఈ విధంగా మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ వీటిని తీసుకుంటున్నారు. అయితే మనలో చాలా మందికి ఈ మొలకలను ఎలా తీసుకోవాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. వీటిని పచ్చిగా అలాగే తీసుకోవాలా లేదా ఉడికించి తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు.
చాలా మంది వీటిని పచ్చిగానే తీసుకుంటూ ఉంటారు. అయితే మొలకలను ఉడికించి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. పచ్చి ఆహారాలను తీసుకోవడం వల్ల అవి త్వరగా జీర్ణం కావు అలాగే వివిధ రకాల జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పచ్చి ఆహారాలను తీసుకోవడం వల్ల అవి సరిగ్గా జీర్ణం కాక వాటిలో ఉండే పోషకాలు మన శరీరానికి సరిగ్గా అందవు. దీంతో వాటి వల్ల కలిగే పూర్తి ప్రయోజనాలను మనం సరిగ్గా పొందలేము. మొలకెత్తిన గింజలను ఎప్పుడూ తీసుకున్నా కూడా వాటిని ఉడికించి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉడికించి తీసుకోవడం వల్ల సరిగ్గా జీర్ణం అవ్వడంతో పాటు వాటిలో ఉండే పోషకాలు కూడా శరీరానికి పూర్తిగా అందుతాయి.
అలాగే కొందరు మొలకలను రాత్రి పూట కూడా తీసుకుంటూ ఉంటారు. ఇలా రాత్రి పూట మొలకలను తీసుకునే వారు చిక్కుళ్లు, శనగలు వంటి వాటిని తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి జీర్ణం అవ్వడానికి సమయం ఎక్కువగా పడుతుంది. అలాగే నిద్రకు కూడా ఆటంకం కలగవచ్చు. ఇక మొలకెత్తిన గింజలను మనం వివిధ పద్దతుల్లో తీసుకోవచ్చు. వీటితో కూరను వండుకుని చపాతీ, పుల్కా వంటి వాటితో తీసుకోవచ్చు. అలాగే అన్నం వండేటప్పుడు అందులో ఈ మొలకలను వేసి ఉడికించి తీసుకోవచ్చు. అలాగే సూప్ ల తయారీలో కూడా ఈ మొలకలను వేసి ఉడికించి తీసుకోవచ్చు. ఈ విధంగా మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే పోషకాలన్నీ మన శరీరానికి పూర్తిగా అందుతాయని మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.