Banana Drink For Sleep : నేటి తరుణంలో మనలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. నిద్రలేమి సమస్య తలెత్తడానికి అనేక కారణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన, శరీరానికి తగినంత శ్రమ లేకపోవడం, శరీరంలో ఉండే వివిధ అనారోగ్య సమస్యలు వంటి రకరకాల కారణాల చేత నిద్రలేమి సమస్య వస్తూ ఉంటుంది. నిద్రలేమి సమస్యను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మన శరీరానికి ఆహారం, గాలి, నీరు ఎలా అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. నిద్రలేమి కారణంగా మనం రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేకపోతాము. అలాగే ఎప్పుడూ నీరసంగా, తలనొప్పిగా ఉంటుంది. ఏ పనిపై శ్రద్ద పెట్టలేకపోతూ ఉంటాము. ఒత్తిడి, కోపం వంటివి మరింత ఎక్కువవుతాయి.
అలాగే బీపీ, గుండె సమస్యలు, మెదడుకు సంబంధించిన సమస్యలు వంటి వివిధ అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి నిద్రమాత్రలను వేసుకుంటూ ఉంటారు. కానీ వీటిని వాడడం మన శరీరానికి అంత మంచిది కాదు. కనుక సహజంగా లభించే పదార్థాలను ఉపయోగించి ఈ సమస్య నుండి బయటపడడం చాలా అవసరం. నిద్రలేమితో బాధపడే వారు మనకు సులభంగా లభించే పదార్థాలతో ఒక చక్కటి డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల నిద్రలేమి సమస్య తగ్గుతుంది. అలాగే ఈ డ్రింక్ ను తాగడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. నిద్రలేమి సమస్యను తగ్గించే డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దీని కోసం మనం రెండు ఆఫ్రికాట్ లను, ఒక అరటిపండును, ఒక స్పూన్ పొద్దు తిరుగుడు గింజలను, ఒక స్పూన్ చియా విత్తనాలను, ఒక గ్లాస్ పాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో పొద్దు తిరుగుడు గింజలు, చియా విత్తనాలు, ఆఫ్రికాట్స్ ను తీసుకోవాలి. తరువాత ఇవి మునిగే వరకు నీటిని పోసి ఒక గంట పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పాలు, అరటి పండు ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గాస్ల్ లోకి తీసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ను రోజూ రాత్రి నిద్రపోవడానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా ఈ డ్రింక్ ను తయారు చేసి తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్ర చక్కగా పడుతుంది. అదే విధంగా ఈ డ్రింక్ ను ఉదయం పూట తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత శక్తి లభించి రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవచ్చు. నిద్రలేమితో బాధపడే వారు ఈ విధంగా డ్రింక్ ను తయారు చేసుకుని సమస్య నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.