Tavudu : ధాన్యాన్ని పాలిష్ పట్టగా వచ్చిన ఆహారాన్ని మనం తవుడు అని అంటాము. ఇది అందరికి తెలిసిందే. సాధారణంగా తవుడును పశువులకు ఆహారంగా ఇస్తూ ఉంటారు. ఈ తవుడును పశువులకు ఆహారంగా ఇవ్వడంతో పాటు దీనిని మనం కూడా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తవుడులో బి కాంప్లెక్స్ విటమిన్స్ తోపాటు మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. 6నెలల పాటు 344 మందిపై ఇరాన్ దేశ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. రోజూ 2 నుండి 3 టీ స్పూన్ల తవుడు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రోజూ తవుడును తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు 40 శాతం మేర పెరుగుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో రక్షణ వ్యవస్థ చాలా ధృడంగా ఉంటుంది. దీంతో మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ నశిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన కూడా పడకుండా ఉంటాము. అలాగే తవుడును తీసుకోవడం వల్ల శరీరంలో 40 శాతం వరకు ఇన్ ప్లామేషన్ కూడా తగ్గుతుంది. తవుడులో గామా ఒరైజనాల్ అనే రసాయన సమ్మేళనం ఉంటుంది. ఇది ఇన్ ప్లామేషన్ ను పెంచే ఎంజైమ్ లను నశింపచయడంలో సహాయపడుతుంది. దీంతో శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గడంతో పాటు రాకుండా ఉంటుంది. అలాగే తవుడును తీసుకోవడం వల్ల దీనిలో ఉండే ఫైబర్ మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేయడంలో సహాయపడుతుంది.
అలాగే తవుడును తీసుకోవడం వల్ల విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9, బి12 వంటి బి కాంప్లెక్స్ విటమిన్స్ అన్నీ కూడా శరీరానికి లభిస్తాయి. అలాగే 100 గ్రాముల తవుడులో 45 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. కనుక దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం రాకుండా ఉంటుంది. అలాగే రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. ఈ విధంగా తవుడు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏ విధమైన తవుడును వాడాలి…ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ధాన్యాల్లో పోషకాలన్నీ కూడా వాటి పైపొరల్లో ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పొరల్లో ప్రోటీన్, కొవ్వు పదార్థాలు, పీచు పదార్థాలు, బి కాంప్లెక్స్ విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
ధాన్యాన్ని పాలిష్ పట్టడం వల్ల ఈ పోషకాలన్నీ తవుడులో వచ్చి చేరతాయి. కనుక తవుడును తీసుకోవడం వల్ల మనం ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మనం వీలైనంత వరకు ధాన్యాన్ని మొదట పాలిష్ పట్టగా వచ్చిన తవుడును సేకరించి తీసుకోవాలి. దీనిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న తవుడును రోజూ 2 నుండి 3 టీ స్పూన్ల మోతాదులో నేరుగా తినవచ్చు లేదా చపాతీపిండిలో కలుపుకుని చపాతీలా చేసుకుని తినవచ్చు. అలాగే మినుములతో కలిపి వేయించి సున్నుండలుగా చేసుకుని తినవచ్చు. అలాగే తవుడును నీటిలో కలిపి తాగవచ్చు. ఈ విధంగా ఏదో ఒక రూపంలో తవుడును తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతంచేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.