Ragi Dalia : మనం రాగి పిండితో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. రాగిపిండితో చేసే వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. తరచూ ఒకే రకం వంటలు కాకుండా రాగిపిండితో మనం ఎంతో రుచిగా ఉండే రాగి దాలియాను కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు, షుగర్ వ్యాధితో బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పిల్లలకు దీనిని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ రాగి దాలియాను ఎలా తయారు చేసుకోవాలి.. తయరీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి దాలియా తయారీకి కావల్సిన పదార్థాలు..
రాగిపిండి – 3 టేబుల్ స్పూన్స్, పల్లీలు – 3 టేబుల్ స్పూన్స్, కందిపప్పు – 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ, ధనియాలు -ఒక టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు – 4, నీళ్లు – 300 ఎమ్ ఎల్, 2 గంటల పాటు నానబెట్టిన సామ బియ్యం – 3 టేబుల్ స్పూన్స్, తరిగిన తోటకూర – ఒక కట్ట, తరిగిన పచ్చిమిర్చి – 1, ఉప్పు – తగినంత, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నిమ్మరసం – అర చెక్క.
రాగి దాలియా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రాగిపిండిని తీసుకుని తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. తరువాత కందిపప్పు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత జీలకర్ర, కరివేపాకు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత అడుగు మందంగా ఉండే గిన్నెలో నీళ్లు పోసి మూత పెట్టి మరిగించాలి. నీళ్లు మరిగిన తరువాత జీలకర్ర, సామబియ్యం, తోటకూర వేసి మూత పెట్టి ఉడికించాలి. సామబియ్యం ఉడికిన తరువాత రాగి పిండి మిశ్రమం వేసి కలపాలి. తరువాత ఉప్పు,మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి.
తరువాత దీనిపై మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత నెయ్యి, నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి దాలియా తయారవుతుంది. దీనిని పెరుగు పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇందులో తోటకూరకు బదులుగా ఇతర ఆకుకూరలను కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా రాగి దాలియాను తయారు చేసి తీసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.