Nuvvula Bobbatlu : నువ్వులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వంటలల్లో వాడడంతో పాటు ఈ నువ్వులతో మనం తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. నువ్వులతో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో నువ్వుల బొబ్బట్లు కూడా ఒకటి. ఈ బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి. బొబ్బట్లు అనగానే చాలా మంది కష్టం, శ్రమతో కూడుకున్న పని అని భావిస్తాయి. కానీ ఈ బొబ్బట్లను చాలా తక్కువ సమయంలో చపాతీ చేసినంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే నువ్వుల బొబ్బట్లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వుల బొబ్బట్ల తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు -ఒక కప్పు, మైదాపిండి – అర కప్పు, గోధుమపిండి -అర కప్పు, ఉప్పు – చిటికెడు, నెయ్యి – 2 టీ స్పూన్స్, యాలకులు – 3, బెల్లం తురుము – ఒక కప్పు.
నువ్వుల బొబ్బట్ల తయారీ విధానం..
ముందుగా కళాయిలో నువ్వులు వేసి వేయించాలి. నువ్వులు చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని పల్స్ ఇస్తూ మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇందులో యాలకులు, బెల్లం తురుము వేసి పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత గిన్నెలో గోధుమపిండి, మైదాపిండి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. తరువాత నెయ్యి వేసి కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టాలి. పిండిచక్కగా నానిన తరువాత మరొసారి బాగా కలుపుకోవాలి.
తరువాత నిమ్మకాయంత పిండిని తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ పూరీలా వత్తుకోవాలి. తరువాత ఇందులో 2 టీ స్పూన్ల నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని ఉంచి అంచులను మూసివేసి ఉండలా చేసుకోవాలి. తరువాత దీనిని పొడి పిండి చల్లుకుంటూ బొబ్బట్ల ఆకారంలో వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. తరువాత బొబ్బట్టు వేసి ముందుగా రెండు వైపులా నిమిషంపాటు కాల్చుకోవాలి. తరువాత నూనె లేదా నెయ్యి వేస్తూ కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నువ్వుల బొబ్బట్లు తయారవుతాయి. వీటిని పూర్తిగా గోధుమపిండితో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అప్పటికప్పుడుఎంతో రుచిగా ఉండే నువ్వుల బొబ్బట్లను తయారు చేసుకుని తినవచ్చు.