Dondakaya Nilva Pachadi : మనం దొండకాయలతో రోటి పచ్చడిని తయారు చేస్తూ ఉంటాము. దొండకాయలతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు. కేవలం రోటి పచ్చడే కాకుండా మనం దొండకాయలతో నిల్వ పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. దొండకాయలతో చేసే నిల్వ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మధ్య మధ్యలో దొండకాయ ముక్కలు తగులుతూ ఈ పచ్చడి తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. అలాగే ఈ పచ్చడి రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది.ఈ నిల్వ పచ్చడిని తయారు చేయడం చాలా సులభం. వంటరాని వారు, మొదటిసారి చేసే వారు కూడా సులభంగా తయారు చేయవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఈ దొండకాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
దొండకాయలు – అరకిలో, కారం – పావు కప్పు, ఆవ పిండి – పావు కప్పు, పసుపు – ఒక స్పూన్, ఉప్పు – పావు కప్పు, మెంతిపిండి – ఒక స్పూన్, నిమ్మరసం – 3 టేబుల్ స్పూన్స్.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – అర కప్పు, ఎండుమిర్చి – 4, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – రెండు చిటికెలు.
దొండకాయ నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా దొండకాయలను శుభ్రంగా కడగాలి. తరువాత వీటిని తుడిచి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తరువాత ఈ దొండకాయల చివర్లను తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు మరీ చిన్నగా ఉండకుండా చూసుకోవాలి. తరువాత ఈ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు, కారం, ఆవ పిండి, మెంతి పిండి, పసుపు వేసి కలపాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఎండుమిర్చి, తాళింపు దినుసులు వేసి వేయించాలి. చివరగా ఇంగువ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ తాళింపు పూర్తిగా చల్లారిన తరువాత పచ్చడిలో వేసి కలపాలి. దీనిని గాజు సీసాలో వేసి రెండు రోజుల పాటు పచ్చడిని ఊరబెట్టాలి. రెండు రోజుల తరువాత పచ్చడిని వేడి వేడి అన్నం, నెయ్యితో సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దొండకాయ నిల్వ పచ్చడి తయారవుతుంది. ఈ విధంగా దొండకాయలతో నిల్వ పచ్చడిని తయారు చేసుకుని తింటూ ఎంజాయ్ చేయవచ్చు.