Carrot For Cholesterol : నేటి తరుణంలో గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఒత్తిడి, ఆందోళన, మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లతో పాటు కొలెస్ట్రాల్ కూడా గుండె జబ్బులు రావడానికి కారణాలుగా చెప్పవచ్చు. గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ముందుగా మనం మన ఆహారపు అలవాట్లల్లో మార్పులు చేసుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో క్యారెట్ మనకు ఎంతగానో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
కంటి చూపును మెరుగుపరిచి, కంటి సమస్యలు రాకుండా చేయడంలో మాత్రమే క్యారెట్ ఉపయోగపడుతుందని అందరూ భావిస్తారు. కానీ క్యారెట్ ను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. క్యారెట్ లో విటమిన్ ఎ, బీటా కెరోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి గుండె ఆరోగ్యం దెబ్బతినకుండా కాపాడడంలో సహాయపడతాయి. అలాగే క్యారెట్ లో ఉండే ఫైబర్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో దోహదపడతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు క్యారెట్ ను తీసుకోవడం వల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.
అలాగే క్యారెట్ లో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. క్యారెట్ ను తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా క్యారెట్ ఎంతో సహాయపడుతుంది. క్యారెట్ లో క్యాలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. చాలా సమయం వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. ఈ విధంగా క్యారెట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని రోజూ ఒకటి చొప్పున తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయని గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే సాధ్యమైనంత వరకు బాగా నమిలి తీసుకోవాలని లేదా జ్యూస్ గా చేసి వడకట్టుకుండా తీసుకోవాలని వారు చెబుతున్నారు. ఇలా తీసుకోవడం వల్ల మాత్రమే క్యారెట్ వల్ల కలిగే ప్రయోజనాలను మనం పూర్తి స్థాయిలో పొందగలుగుతామని నిపుణులు సూచిస్తున్నారు.