Chintha Aku Karam Podi : మనం సహజంగా చింత చిగురును, చింతపండును ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. చింతచిగురు, చింతపండులో కూడా పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటితో పాటు మనం చింతాకును కూడా ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. చింతాకుతో రుచికరమైన కారం పొడిని తయారు చేసి తీసుకోవచ్చు. ఈ కారాన్ని తయారు చేయడం చాలా సులభం. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా దీనిని తీసుకోవచ్చు. చక్కటి వాసనతో ఎంతో కమ్మగా ఉండే చింతాకు కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చింతాకు కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
చింతాకు – ఒక పెద్ద కప్పు, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 15 నుండి 20, నూనె – 2 టీ స్పూన్స్, కరివేపాకు – గుప్పెడు, ఉప్పు – తగినంత, వెల్లుల్లి రెబ్బలు – 10.
చింతాకు కారం తయారీ విధానం..
ముందుగా చింతాకును శుభ్రంగా కడిగి రెండు రోజుల పాటు ఎండలో ఎండబెట్టాలి. తరువాత దీనిని కళాయిలో వేసి దోరగా వేయించి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో ధనియాలు, జీలకర్ర వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత కరివేపాకు కూడా వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇవన్నీ చల్లారిన తరువాత ముందుగా జార్ లో చింతాకు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేయించిన దినుసులతో పాటు ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చింతాకు కారం తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చింతాకుతో రుచికరమైన కారాన్ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది.