Ulavacharu Kodiguddu Kura : ఉలవలు.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి తెలిసిందే. ఉలవలను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది. ప్రోటీన్ లోపం ఉన్న వారు ఉలవలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఉలవలతో మనం ఎక్కువగా చారును తయారు చేస్తూ ఉంటాము.ఉలవచారు చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ ఉలవలతో చారునే కాకుండా కోడిగుడ్డు పులుసును కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పులుసు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. కోడిగుడ్లతో తరుచూ ఒకేరకం పులుసు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఉలవలతో కోడిగుడ్డు పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉలవచారు కోడిగుడ్డు పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉలవలు – ఒక గ్లాస్, నీళ్లు – 5 గ్లాసులు, నానబెట్టిన చింతపండు – నిమ్మకాయంత, నూనె – 3 టీ స్పూన్స్, ఉడికించిన కోడిగుడ్లు – 5, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 5, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టేబుల్ స్పూన్స్, బటర్ – ఒక టీ స్పూన్.
ఉలవచారు కోడిగుడ్డు పులుసు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో ఉలవచారును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. తరువాత ఈ ఉలవలను కుక్కర్ లోకి తీసుకోవాలి. ఉలవలను నానబెట్టిన నీటిని పోసి మూత పెట్టి ముందుగా చిన్న మంటపై 20 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మంటను మధ్యస్థంగా చేసి 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత ఈ ఉలవలను మెత్తగా చేసుకుని వడకట్టాలి. ఇప్పుడు ఉలవలను వడకట్టగా వచ్చిన నీటిలో చింతపండు రసం వేసి కలిపి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత చిటికెడు పసుపు వేసి కోడిగుడ్లను వేసి వేయించాలి. వీటిని ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి.
తరువాత అదే కళాయిలో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. తరువాత తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత ముందుగా తయారు చేసుకున్న ఉలవల పులుసు వేసి కలపాలి. పులుసు మరిగిన తరువాత వేయించిన కోడిగుడ్లు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత బటర్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉలవచారు కోడిగుడ్డు పులుసు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ పులుసును తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.