White Mustard Seeds : మన వంటింట్లో ఉండే తాళింపు దినుసుల్లో ఆవాలు కూడా ఒకటి. ఆవాలు వేయకుండా మనం వంటలు చేయమనే చెప్పవచ్చు. ఆవాల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయి. వంటల్లో ఆవాలను వాడడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. అయితే మనం వంటల్లో వాడే ఆవాలు నలుపు రంగులో ఉంటాయి. ఇవి మనందరికి తెలిసినవే. అయితే ఆవాలల్లో మరో రకం కూడా ఉంటాయి. అవే తెల్ల ఆవాలు. వీటిని మనలో చాలా మంది చూసి ఉండరు. నల్ల ఆవాల వలె తెల్ల ఆవాలు కూడా అనేక పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వీటిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. తెల్ల ఆవాలను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తెల్ల ఆవాలల్లో ఉండే పోషకాల గురించి అలాగే వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెల్ల ఆవాలల్లో ఫైబర్, ఫ్యాట్స్, బీటా కెరోటీన్, విటమిన్ ఎ, బి1, బి2, బి3, బి6, బి9, సి, ఇ, కె, ఐరన్, మాంగనీస్ వంటి ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ఎక్కువగా చేపల కూరలల్లో, సలాడ్స్, సూప్స్ వంటి వాటితో తెల్ల ఆవాల పొడిని వాడుతూ ఉంటారు. తెల్ల ఆవాలను ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్తి సమస్య తగ్గుతుంది. అలాగే మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా రక్తపోటును అదపులో ఉంచడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో కూడా తెల్ల ఆవాలు మనకు దోహదపడతాయి. అలాగే తెల్ల ఆవాలను తీసుకోవడం వల్ల కండరాల తిమ్మిర్లు, నరాల బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి.
శరీరంలో ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో కూడా తెల్ల ఆవాలు మనకు దోహదపడతాయి. తెల్ల ఆవాల నుండి తీసిన నూనెను నొప్పులు ఉన్న చోట రాసి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా సులభంగా నొప్పులు తగ్గుతాయి. అలాగే దగ్గు, గొంతునొప్పి, గొంతులో ఇన్ఫెక్షన్, కఫం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా తెల్ల ఆవాలు మనకు దోహదపడతాయి. తెల్ల ఆవాల నూనెను గోరు వెచ్చగా చేసి గొంతుపై రాసి నూనె చర్మంలోకి ఇంకేలా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల గొంతు సమస్యలు తగ్గుతాయి. ఈవిధంగా అనేక రకాలుగా తెల్ల ఆవాలు మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని వీటిని కూడా నల్ల ఆవాల వలె ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.