Diabetes : మనలో చాలా మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. షుగర్ వ్యాధి కారణంగా బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. అలాగే ఈ వ్యాధి వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. షుగర్ వ్యాధి కారణంగా మనం అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అలాగే మన జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అంతేకాకుండా మనం తీసుకునే ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు మరింతగా పెరిగి తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో పండ్లు మనకు ఎంతో సహాయపడతాయి.
పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. అయితే షుగర్ వ్యాధి గ్రస్తులు అన్ని రకాల పండ్లను తీసుకోకూడదు. కొన్ని రకాల పండ్లు సహజ సిద్దంగా తియ్యగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఇలాంటి పండ్లకు షుగర్ వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలి. షుగర్ వ్యాధిని మరింతగా పెంచే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ తో బాధపడే వారు అరటి పండును తీసుకోకూడదు. అరటిపండులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. కానీ షుగర్ వ్యాధితో బాధపడేవారు అరటి పండ్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
కనుక షుగర్ వ్యాధితో బాధపడే వారు అరటిపండును తీసుకోకపోవడమే మంచిది. అలాగే షుగర్ వ్యాధితో బాధపడే వారు మామిడిపండ్లను కూడా తీసుకోకూడదు. మామిడిపండ్లల్లో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటి యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కనుక మామిడి పండ్లకు కూడా దూరంగా ఉండాలి. అదే విధంగా షుగర్ వ్యాధి గ్రస్తులు పైనాపిల్ ను కూడా ఎక్కువగా తీసుకోకూడదు. పైనాపిల్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ దీనిలో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలో త్వరగా కలిసిపోయి చక్కెర స్థాయిలను పెంచుతాయి. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎండు ఖర్జూరలను కూడా తక్కువగా తీసుకోవాలి.
ఎండు ఖర్జూరాలలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వీటికి కూడా దూరంగా ఉండాలి. ఇక పుచ్చకాయను కూడా షుగర్ వ్యాధి గ్రస్తులు తక్కువగా తీసుకోవాలి. పుచ్చకాయ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ దాదాపు 70 నుండి 72 మధ్యలో ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కనుక షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లకు దూరంగా ఉండాలని వీటిని బదులుగా ఇతర పండ్లను ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ పండ్లను తినాలనిపిస్తే చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలని అప్పుడే ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుందని వారు చెబుతున్నారు.