Heart Attacks : నేటి తరుణంలో గుండెపోటుతో మరణించే వారిసంఖ్య పెరుగుతుందని చెప్పవచ్చు. గత మూడు సంవత్సరాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. చిన్న వయసులో ఉన్న వారు కూడా గుండెపోటుతో మరణించడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్లనే ఇలా గుండెపోటుతో మరణిస్తున్నారు అనే అంశాన్ని కొందరు ప్రస్తావించారు. దీంతో ఈ అంశంపై ఐసిఎంఆర్ పరిశోధనలు నిర్వహించింది.
ఈ పరిశోధనల్లో వెల్లడైన విషయాలు ఏమిటి.. కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్లనే గుండెపోటు వస్తుందా.. గుండెపోటుకు కరోనా వ్యాక్సిన్ కు సంబంధం ఉందా.. అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుండెపోటుకు కరోనా వ్యాక్సిన్ కు ఎటువంటి సంబంధం లేదని నిపుణులు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. 2021 మరియు 2022 మధ్యలో 1,578 మంది గుండె రోగులపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని నిపుణులు చెబుతున్నారు. గుండెజబ్బులతో బాధపడే వారిలో 70 శాతం మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారని మిగిలిన 30 శాతం మంది కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని నిపుణులు వెల్లడించారు.
అలాగే కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి గుండె జబ్బులు కనిపించలేదని కూడా వారు తెలియజేసారు. గుండెపోటుతో మరణించే వారిలో బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్ తో పాటు ఇతర గుండె జబ్బులు ఉన్నాయని వారు వెల్లడించారు. కరోనా వంటి ప్రాణాంతక సమస్య నుండి వ్యాక్సిన్ బయటపడేసిందని అంతేకాని వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎవరూ మరణించలేదని వారు చెబుతున్నారు. గుండెపోటుకు మరియు కొవిడ్ వ్యాక్సిన్ కు ఎటువంటి సంబంధం లేదని వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాణహాని కలగదని నిపుణులు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.