Instant Coconut Laddu : మనం పచ్చి కొబ్బరిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వంటలల్లో వాడడంతో పాటు పచ్చి కొబ్బరితో మనం ఎంతో రుచికరమైన తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. పచ్చి కొబ్బరితో చేసే తీపి వంటకాల్లో కొబ్బరి లడ్డూలు కూడా ఒకటి. పచ్చి కొబ్బరి, పంచదార కలిపి చేసే ఈ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఇన్ స్టాంట్ గా ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా పండగలకు ఇలా కొబ్బరితో రుచికరమైన లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు. తినన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ కొబ్బరి లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్ స్టాంట్ కొకోనట్ లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
కొబ్బరికాయ – 1, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, కాచి చల్లార్చిన పాలు -1/3 కప్పు, పంచదార – ముప్పావు కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్.
ఇన్ స్టాంట్ కొకోనట్ లడ్డూ తయారీ విధానం..
ముందుగా కొబ్బరికాయ నుండి కొబ్బరిని తీసుకోవాలి. తరువాత దీనిపై ఉండే నల్లటి తొక్కను తీసేసి వీలైనంత సన్నగా తురుముకోవాలి. ఇలా తయారు చేసుకున్న కొబ్బరి తురుము ఒకటిన్నర కప్పు వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు కళాయిలో ఈ తురుమును కళాయిలో వేసి చిన్న మంటపై కలుపుతూ 10 నుండి 15 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొబ్బరి తురుము పొడి పొడిగా అయిన తరువాత నెయ్యి వేసి కలపాలి. దీనిని మరోరెండు నిమిషాల పాటు వేయించిన తరువాత పాలు పోసి కలపాలి.
తరువాత పంచదార వేసి కలపాలి. దీనిని మరో 10 నిమిషాల పాటు కలుపుతూ వేయించిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమం గోరు వెచ్చగా అయిన తరువాత లడ్డూలుగా చుట్టుకోవాలి. తరువాత ఈ లడ్డూలకు ఎండు కొబ్బరి పొడితో గార్నిష్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొబ్బరి లడ్డూలు తయారవుతాయి. తీపి తినాలనిపించినప్పుడు లేదా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఇలా చాలా తక్కువ సమయంలో కొబ్బరితో రుచికరమైన లడ్డూలను తయారు చేసి ఇవ్వవచ్చు. ఈ విధంగా తయారు చేసిన లడ్డూలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.