Veg Bhurji Recipe : మనం కోడిగుడ్లతో చేసే వంటకాల్లో ఎగ్ బుర్జీ కూడా ఒకటి. ఎగ్ బుర్జీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే ఎగ్ బుర్జీనే కాకుండా నాన్ వెజ్ తినని వారు వెజ్ బుర్జీని కూడా తయారు చేసుకోవచ్చు. అవును మీరు విన్నది నిజమే. వెజ్ బుర్జీని కూడా మనం సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ వెజ్ బుర్జీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ బుర్జీ తయారీకి కావల్సిన పదార్థాలు..
పచ్చికొబ్బరి – అర చెక్క, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు -2 ( మధ్యస్థంగా ఉన్నవి), నూనె – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, నీళ్లు – 3 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
వెజ్ బుర్జీ తయారీ విధానం..
ముందుగా పచ్చికొబ్బరిపై ఉండే నల్లటి భాగాన్ని తీసేసి ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఈ ముక్కలను జార్ లో వేసి తురుముగా అయ్యే వరకు మిక్సీ పట్టుకుని పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి అర నిమిషం పాటు వేయించాలి. తరువాత కొబ్బరి తురుము వేసి కలపాలి. దీనిని అంతా కలిసేలా కలుపుకున్న తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి 3 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. తరువాత చిన్న మంటపై మరో 5 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ బుర్జీ తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ వెజ్ బుర్జీని కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కొబ్బరితో తరుచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.