Pudina Rasam : పుదీనా రసం.. వంటల్లో గార్నిష్ కోసం వాడే పుదీనాతో చేసే ఈ రసం చాలా రుచిగా ఉంటుంది. ఈ రసాన్ని ఎక్కువగా తమిళనాడులో తయారు చేస్తూ ఉంటారు. తమిళనాడు స్పెషల్ వంటకాల్లో ఇది కూడా ఒకటి. ఈ రసంతో తింటే కడుపు నిండా భోజనం చేస్తారని చెప్పవచ్చు. ఈ రసాన్ని తయారు చేయడం చాలా సులభం . జలుబు, దగ్గు, ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఇలా పుదీనా రసాన్ని తయారు చేసి తీసుకోవచ్చు. చక్కటి వాసనతో, రుచితో ఉండే ఈ పుదీనా రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పుదీనా రసం తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టేబుల్ స్పూన్, కందిపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్,ఎండుమిర్చి – 3, నూనె – ఒక టీ స్పూన్, చిక్కటి చింతపండు రసం – 100 ఎమ్ ఎల్, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నీళ్లు – 400 ఎమ్ ఎల్, ఉడికించి మెత్తగా చేసిన కందిపప్పు – అర కప్పు, పుదీనా – ఒక పెద్ద కట్ట.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – రెండు చిటికెలు, ఆవాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 3, జీలకర్ర – ఒక టీ స్పూన్.
పుదీనా రసం తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ధనియాలు, మిరియాలు, కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి పొడిగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో చింతపండు రసం, పసుపు, ఉప్పు, నీళ్లు, మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. దీనిని స్టవ్ మీద ఉంచి చిన్న మంటపై మరిగించాలి. తరువాత కందిపప్పు వేసి రసాన్ని మరిగించాలి. రసం చక్కగా మరిగిన తరువాత పుదీనా ఆకులు వేసి కలపాలి. దీనిని మరో 3 నుండి 4 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత ఇంగువ, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించి రసంలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పుదీనా రసం తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. పుదీనాతో పుదీనా చట్నీ, పుదీనా రైస్ మాత్రమే కాకుండా ఇలా రుచిగా రసాన్ని కూడా తయారు చేసి తీసుకోవచ్చు.