Yakhni Pulao : మనకు ముస్లింల ఫంక్షన్ లల్లో సర్వ్ చేసే వంటకాల్లో యఖ్ని పులావ్ కూడా ఒకటి. దీనిని రంజాన్ మాసంలో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. చికెన్ సూప్ తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కావాలంటారు. తరుచూ చేసే చికెన్ పులావ్ కంటే ఈ చికెన్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా ఈ చికెన్ పులావ్ ను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ముస్లింల ఫంక్షన్ లల్లో ఎక్కువగా వండించే ఈ యఖ్ని పులావ్ ను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
యఖ్ని పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్,నూనె – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, నల్ల యాలక్కాయ – 1, అనాస పువ్వు – 1, లవంగాలు – 4, యాలకులు – 2, బిర్యానీ ఆకు – 1, సాజీరా – అర టీ స్పూన్, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ – 1, అరగంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ – అరకిలో, తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – కొద్దిగా, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, గంట పాటు నానబెట్టిన బాస్మతీబియ్యం -ఒకటిన్నర కప్పు, ఎండిన దేశవాలీ గులాబీ రేకులు – ఒక టీ స్పూన్, రోజ్ వాటర్ – ఒక టీ స్పూన్.
చికెన్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – ఒక లీటర్, చికెన్ బోన్స్ – 100 గ్రా., పసుపు – పావు టీ స్పూన్, యాలకులు – 2, లవంగాలు – 3, మిరియాలు – అర టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, తరిగిన కొత్తిమీర – అర కట్ట.
యఖ్ని పులావ్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. ఇందులోనే సూప్ కు కావల్సిన పదార్థాలన్నీ వేసి చిన్న మంటపై నీరు సగం అయ్యే వరకు బాగా మరిగించాలి.తరువాత ఈ నీటిని వడకట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడు కుక్కర్ లో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించాలి. తరువాత చికెన్ వేసి 2 నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు వేయించిన తరువాత ఉప్పు, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి వేసి మరో 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న చికెన్ సూప్ ఒకటిన్నర కప్పుల మోతాదులో వేసి కలపాలి.
తరువాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. ఇప్పుడు బియ్యం వేసి కలపాలి. పైన నుండి గులాబి రేకులు వేసి మూత పెట్టాలి. ఈ పులాన్ ను చిన్న మంటపై ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత మూత తీసి పైన రోజ్ వాటర్ ను వేసుకోవాలి. తరువాత అంతా కలిసేలా కలుపుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే యఖ్ని పులావ్ తయారవుతుంది. దీనిని వద్దూ అనకుండా ఇంకా కావాలని అడిగి మరీ ఇష్టంగా తింటారు.