Turmeric Side Effects : బంగారు మసాలా గా పిలువబడే పసుపు గురించి తెలియని వారుండరు అనే చెప్పవచ్చు. ఎంతో కాలంగా మనం పసుపును ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాము. వంటల్లో పసుపును విరివిగా వాడుతూ ఉంటారు.పసుపు చక్కటి రంగుతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. పసుపును వాడడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా పసుపును ఔషధంగా వినియోగిస్తూ ఉంటారు. పసుపును వాడడం వల్ల శరీరంలో రోగని రోధక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు మనల్ని ఇన్పెక్షన్ ల బారి నుండి కాపాడడంలో దోహదపడతాయి. పసుపును ఉపయోగించడం వల్ల శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, శరీరంలో కొవ్వును కరిగించడంలో, బరువు తగ్గడంలో, షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా పసుపు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
అయితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని కదా అని పసుపును ఎక్కువగా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. పసుపును అధికంగా వాడడం వల్ల మనం వివిధ రకాల దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పసుపును ఎక్కువగా వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం రోజుకు 500 నుండి 2000 మిల్లీ గ్రాముల మోతాదులో మాత్రమే పసుపును ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. పసుపును అధిక మోతాదులో తీసుకోవడం వల్ల జీర్ణాశయ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో నొప్పి, డయేరియా, యాసిడ్ రిప్లెక్స్ వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అలాగే 450 మిల్లీ గ్రాముల కంటే పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే పిత్తాశయంలో రాళ్ల సమస్య తలెత్తే అవకాశం కూడా ఉంది.
పసపును అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు మరింత ఎక్కువయ్యే అవకశం ఉంది. అలాగే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు పసుపును ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. రక్తస్రావం సమస్యలతో బాధపడే వారు, జీర్ణాశయ సమస్యలతో బాధపడే వారు, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు పసుపును వీలైనంత తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పసుపు ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికి దీనిని తగిన మోతాదులో తీసుకున్నప్పుడే పసుపు వల్లకలిగే ప్రయోజనాలను మనం పొందగలుగుతామని నిపుణులు చెబుతున్నారు. అలాగే నేటి తరుణంలో పసుపులో రంగులు కలిపి దీనిని కూడా కల్తీ చేస్తున్నారు. ఇలా కల్తీ చేసిన పసుపును వాడడం వల్ల మరిన్ని అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని కనుక నాణ్యమైన పసుపును మాత్రమే ఉపయోగించాలని వారు సూచిస్తున్నారు.