Street Style Chicken Pakoda : మనకు సాయంత్రం సమయంలో రోడ్ల పక్కన బండ్ల మీద లభించే వివిధ రకాల రుచికరమైన చిరుతిళ్లల్లో చికెన్ పకోడాలు కూడా ఒకటి. చికెన్ పకోడా చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. బండ్ల మీద చేసే ఈ చికెన్ పకోడా క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటుంది. దీనిని అదే రుచితో, అంతే క్రిస్పీగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా చికెన్ పకోడాలను తయారు చేసి తీసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్ లో ఇంట్లోనే చికెన్ పకోడాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ పకోడా తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్న ముక్కలుగా కట్ చేసిన చికెన్ – అరకిలో, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్స్, కారం – 2 టీ స్పూన్స్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – ఒకటిన్నర టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి – 3, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్, బియ్యంపిండి- 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, నూనె – అర టేబుల్ స్పూన్, కోడిగుడ్డు – 1.
చికెన్ పకోడా తయారీ విధానం..
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, పసుపు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తరువాత మిగిలిన పదార్థాలన్నింటిని ఒక్కొక్కటిగా వేసి బాగా కలపాలి. తరువాత ఈ చికెన్ ను ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. తరువాతచికెన్ ను వేసి వేయించాలి. ఈ చికెన్ ను మధ్యస్థ మంటపై కలుపుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ పకోడి తయారవుతుంది. దీనిని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెన్ పకోడిని ఒక్క ముక్క కూడా విడిచిపెట్టకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.