Vellulli Pulusu : వెల్లుల్లి పులుసు.. వెల్లుల్లి రెబ్బలు వేసి చేసే ఈ పులుసుకూర చాలారుచిగా ఉంటుంది. అన్నంతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. దీనిని ఎక్కువగా తమిళనాడులో తయారు చేస్తూ ఉంటారు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా వెల్లుల్లి రెబ్బలతో పులుసును తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. తరుచూ ఒకేరకం పులుసు కూరలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వెల్లుల్లితో కమ్మటి పులుసు కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, తరిగిన టమాట – 1, నూనె – పావు కప్పు, ఇంగువ – చిటికెడు, ఆవాలు – ఒక టీ స్పూన్,సోంపు గింజలు – అర టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు – 10 నుండి 15, తరిగిన ఉల్లిపాయలు – 3 పెద్దవి, చిన్నగా తరిగిన బంగాళాదుంప – 1, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, నీళ్లు – 100 ఎమ్ ఎల్, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్.
మసాలా పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక టీస్పూన్, కందిపప్పు – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, మిరియాలు -ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, సోంపుగింజలు -ఒక టీ స్పూన్, ఎండుమిర్చి- 5.
వెల్లుల్లి పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలా పొడికి కావల్సిన పదార్థాలన్నీ వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత చింతపండు రసాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇందులోనే టమాట ముక్కలు వేసి చేత్తో ముక్కలు మెత్తగా అయ్యేలా నలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఇంగువ, ఆవాలు, సోంపు గింజలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. తరువాత బంగాళాదుంప ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి.
వీటిని 4 నిమిషాల పాటు వేయించిన తరువాత చింతపండు గుజ్జు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి చిన్న మంటపై 5 నిమిషాల పాటు మగ్గించిన తరువాత కారం వేసి కలపాలి. తరువాత మరలా మూత పెట్టి టమాట ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడి, నీళ్లు పోసి కలపాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి పులుసు కూడా తయారవుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు ఇడ్లీ, దోశ వంటి వాటితో కూడా ఈ పులుసును తినవచ్చు.