Chettinad Style Chicken : చికెన్ తో మనం రకరకాల వెరైటీ వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. చికెన్ తో చేసే ఈ వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చికెన్ చుక్కా కూడా ఒకటి. చికెన్ చుక్కా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ వంటి వాటిలోకి ఇది చాలా చక్కగా ఉంటుంది. తరుచూ చికెన్ తో ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ చికెన్ చుక్కాను చెట్టినాడు స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చెట్టినాడు స్టైల్ చికెన్ చుక్కా తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, సోంపు గింజలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 4, కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, చికెన్ – అరకిలో, ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, తరిగిన టమాటాలు – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్.
చెట్టినాడు స్టైల్ చికెన్ చుక్కా తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక సోంపు గింజలు, జీలకర్ర వేసి వేయించాలి . తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారే వరకు వేయించాలి. తరువాత చికెన్, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత టమాట ముక్కలు వేసి కలపాలి. దీనిపై మరలా మూత పెట్టి చికెన్ లోని నీరంతా పోయే వరకు ఉడికించాలి. చికెన్ లోని నీరంతా పోయి చికెన్ మెత్తగా ఉడికిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.
దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించిన తరువాత కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. దీనిని రెండు నిమిషాల పాటు ఉడికించిన తరువాత కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. తరువాత దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించిన తరువాత కొత్తిమీర, మరికొద్దిగా కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ చుక్కా తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన చికెన్ చుక్కాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.