Healthy Chaat : పెసర్ల చాట్.. మొలకెత్తిన పెసర్లతో చేసే ఈ చాట్ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా లేదా సలాడ్ గా, అలాగే రాత్రి పూట తక్కువగా తినాలనిపించినప్పుడు ఇలా చాట్ ను తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారు ఇలా చాట్ ను చేసి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ పెసర్ల చాట్ ను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర్ల చాట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మొలకెత్తిన పెసర్లు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన టమాట – 1, చిన్నగా తరిగిన కీరదోస ముక్కలు – 3 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, వేయించిన జీలకర్ర పొడి – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క.
పెసర్ల చాట్ తయారీ విధానం..
ముందుగా మొలకెత్తిన పెసర్లను శుభ్రంగా కడగాలి. తరువాత ఇందులో ఉప్పు, పసుపు వేసి కలపాలి. తరువాత ఈ పెసర్లను ఆవిరి మీద 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉల్లిపాయ ముక్కలతో పాటు మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి బాగా కలపాలి. అంతే ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసర్ల చాట్ తయారవుతుంది. దీనిని తినడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.