Dry Fruit Burfi : మనం డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా నానబెట్టి తీసుకుంటూ ఉంటాము. డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే కేవలం నానబెట్టి కాకుండా డ్రై ఫ్రూట్స్ తో మనం బర్ఫీని కూడా తయారు చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ బర్ఫీ మనకు ఎక్కువగా స్వీట్ షాపుల్లో లభిస్తూ ఉంటుంది. ఈ బర్ఫీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. పందచార, బెల్లం వేయకుండా చేసే ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్ బర్ఫీని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చర్మఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తహీనత తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు ధృడంగా తయారవుతుంది. పిల్లలకు ఈ బర్ఫీని ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. ఈ బర్ఫీని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ డ్రై ఫ్రూట్ బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్ బర్ఫీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – ఒక టీ స్పూన్, చిన్న ముక్కలుగా కట్ చేసిన బాదంపప్పు – పావు కప్పు, చిన్న ముక్కలుగా కట్ చేసిన జీడిపప్పు – పావు కప్పు, తరిగిన పిస్తా – 2 టేబుల్ స్పూన్స్, పుచ్చ గింజలు – ఒక టేబుల్ స్పూన్, గుమ్మడి గింజలు – 2 టేబుల్ స్పూన్స్, పొద్దు తిరుగుడు గింజలు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుద్రాక్ష – 2 టేబుల్ స్పూన్స్, తరిగిన అంజీర్ – 2 టేబుల్ స్పూన్స్, ఎండుకొబ్బరి తురుము – పావు కప్పు, ఖర్జూర పండ్లు – 250 గ్రా., జాజికాయ పొడి – చిటికెడు, గసగసాలు – అర టేబుల్ స్పూన్.
డ్రై ఫ్రూట్ బర్ఫీ తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా పప్పు వేసి వేయించాలి. వీటిని 2 నిమిషాల పాటు వేయించిన తరువాత పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు గింజలు వేసి వేయించాలి. వీటిని కొద్దిగా వేయించిన తరువాత ఎండుద్రాక్ష, అంజీర్ వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత చివరగా ఎండుకొబ్బరి తురుము వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇదే కళాయిలో గసగసాలను కూడా వేసి వేయించి మరో ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఖర్జూర పండ్లను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో మరో టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి.
తరువాత మిక్సీ పట్టుకున్న ఖర్జూర పేస్ట్ ను వేసి కలుపుతూ 5 నిమిషాల పాటు వేయించాలి. తరువాత వేయించిన డ్రై ఫ్రూట్స్, జాజికాయ పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం గోరు వెచ్చగా అయిన తరువాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవచ్చు. లేదంటే ఈ మిశ్రమాన్ని రోల్ లాగా చేసుకుని పైన గసగసాలతో కోటింగ్ చేసుకుని బటర్ పేపర్ లో వేసి గట్టిగా చుట్టుకోవాలి. తరువాత దీనిని 15 నిమిషాల పాటు ఫ్రిజ్ లో ఉంచి ఆ తరువాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే డ్రై ఫ్రూట్ బర్ఫీ తయారవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.