ఏ రంగానికి చెందిన కంపెనీ అయినా తమ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం, వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం తమ తమ ఉత్పత్తులను ఆకర్షణీయంగా కనిపించేలా తయారు చేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయా ఉత్పత్తుల ప్యాకింగ్‌పై లోగో, బ్రాండ్ ఇమేజ్ వంటి వాటిని ముద్రించి జనాలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తాయి. అయితే ఇలా చేయడంలో అన్ని కంపెనీలు సక్సెస్ కావు, కేవలం కొన్ని మాత్రమే విజయం దిశగా పయనిస్తాయి. అలా విజయం సాధించిన కంపెనీల్లో పార్లే-జి (Parle-G) కూడా ఒకటి. ఇంతకీ ఆ కంపెనీ తమ ఉత్పత్తులకు ఆకర్షణ పెంచడం కోసం ఏం చేసిందనేగా మీ డౌట్. అదే ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Parle-G కంపెనీ బిస్కట్లను మీరెప్పుడైనా తిన్నారా? తినకేం, చెప్పలేనన్ని ప్యాకెట్లను ఇప్పటి వరకు కొని తిన్నాం, అంటారా? అయితే ఆగండి, అక్కడే ఆగిపోండి. ఆ కంపెనీ బిస్కెట్ ప్యాకెట్‌ను కొన్నాక దానిపై మీరేం గమనించారు? ఎవరైనా ఏం చూస్తారు, కంపెనీ పేరు, బిస్కట్ల పేరు, వాటిలో కలిసిన పదార్థాలు, ఆ బిస్కెట్లను తినడం వల్ల వచ్చే శక్తి తదితర వివరాలను చూస్తారని చెబుతారా? అయితే వాటితోపాటు ఇంకో విషయం కూడా మీరు గమనించే ఉండాలే! అదేనండీ ప్యాక్‌పై ఓ చిన్నారి బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మనే, చూశారా! చూడకేం, చాలా సార్లు చూశామంటారా? మీరు చూసే ఉంటారు, కానీ ఆ బొమ్మ గురించి మీరేమనుకుంటున్నారు? ఏమనుకోవడమేమిటి? అది బొమ్మే కదా! అంటారా? అయితే అక్కడే మీరు పప్పులో కాలేశారు. అది బొమ్మే. కానీ అందులో ఉన్న చిన్నారి నిజం కాదు. అవును.. మీరు షాకైనా ఇది నిజమే.
Parle కంపెనీ వారు తమ Parle-G బిస్కట్లపై ఎప్పటి నుంచో వాడుతున్న ఆ చిన్నారి ఫొటోను చూసి కొందరు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన నీరు దేశ్ పాండే చిన్నప్పటి చిత్రం అది అని భావించారు. కానీ తరువాత కొందరు దాన్ని ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి భార్య సుధా మూర్తి చిన్నప్పటి ఫొటో అని కూడా ప్రచారం చేశారు. అయితే ఇదంతా వట్టిదేనని తేలింది. ఆ కంపెనీ ప్రతినిధి ఒకరు స్వయంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. తమ బిస్కెట్ల ప్యాక్‌లపై ఉండే చిన్నారి నిజమైన ఫొటో కాదని, కేవలం పిల్లలను ఆకర్షించేందుకు ఒక ఊహాజనిత పాప ఫొటోను అప్పట్లో అలా ప్రింట్ చేశామని పార్లె కంపెనీ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. దీంతో ఆ చిన్నారి ఫోటోపై వచ్చిన వార్తలు అన్నీ వట్టి పుకార్లేనని స్పష్టం అయిపోయింది.