కోర్టు, జైలుకు సంబంధించిన రెండు విషయాలు ఉన్నాయి కదా.. అవేనండీ. బెయిల్, పెరోల్. అవును, అవే. ఇవి రెండు వేర్వేరు అంశాలు అయినా చాలా మంది వీటి విషయంలో కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. బెయిల్, పెరోల్ అని చెబితే ఈ రెండింటి మధ్య చాలా మంది తేడాలు కనుక్కోలేరు. ఏది ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఏది అవసరం అవుతుంది, దాన్ని ఎవరు ఇస్తారు, డబ్బులు ఏమైనా ఖర్చవుతాయా..? వంటి విషయాలు కూడా చాలా మందికి తెలియవు. ఈ క్రమంలోనే అసలు బెయిల్ అంటే ఏమిటి..? పెరోల్ అంటే దేన్ని అంటారు..? రెండింటికీ మధ్య తేడాలు ఏమిటి..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బెయిల్ అంటే ఎవరైనా వ్యక్తి ఏదైనా కేసులో అరెస్టు అయినప్పుడు పోలీసులు అరెస్టు చేస్తారు కదా. అనంతరం ఆ వ్యక్తిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరుస్తారు. ఆ క్రమంలో న్యాయమూర్తి సదరు వ్యక్తిని రిమాండ్‌కు తరలించమని ఆదేశిస్తారు. అయితే తదుపరి విచారణకు హాజరు అయ్యేవరకు అలాంటి వ్యక్తులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొంత పూచీకత్తు, వ్యక్తుల హామీతో బెయిల్ మంజూరు చేస్తారు. అయితే కొన్ని కేసుల్లో పూచీకత్తు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. కొన్ని కేసులకు తక్కువగా ఉంటుంది. కానీ కొన్ని కేసులకు మాత్రం బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు. అది కేసును బట్టి న్యాయమూర్తి డిసైడ్ చేస్తారు. దీంతో బెయిల్ పొంది బయటకు రావచ్చు. అనంతరం కేసు కోర్టులో విచారణకు వచ్చినప్పుడు హాజరు కావల్సి ఉంటుంది. అప్పుడు దోషి అని తేలితే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. లేదంటే నిర్దోషిగా బయటకు వస్తారు.
అయితే ఏదైనా కేసులో దోషులుగా గుర్తింపబడి ఎవరికైనా శిక్ష పడితే వారు జైలుకు వెళ్తారు. అలా వారు కొంత కాలం పాటు జైలులో ఉన్నాక పెరోల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే జైలు శిక్ష తగ్గిన సందర్భంలోనూ పెరోల్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి సొమ్ము ఫీజుగా చెల్లించాల్సిన పనిలేదు. ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అందుకు తగిన కారణాలను ప్యానెల్‌కు చూపించాలి. సాధారణంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఇంట్లో ఎవరైనా చనిపోతే లేదంటే పెళ్లి వంటి శుభకార్యాలు ఉంటే, ఇల్లు కూలడం, ప్రకృతి విపత్తులు సంభవించి ఖైదీ కుటుంబానికి నష్టం రావడం వంటి ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే ఖైదీలకు పెరోల్ ఇస్తారు. అయితే పెరోల్ ఇచ్చాక ఎప్పటికప్పుడు ఖైదీలు సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేయని పక్షంలో పెరోల్ రద్దు చేస్తారు. అనంతరం మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఇదీ.. బెయిల్‌కు, పెరోల్‌కు మధ్య ఉన్న తేడా..!