Veg Kheema : మనం మీల్ మేకర్ లతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మీల్ మేకర్ లతో తయారు చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మీల్ మేకర్ లతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో సోయా ఖీమా కూడా ఒకటి. మీల్ మేకర్ లతో చేసే ఈ ఖీమా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. మీల్ మేకర్ లతో తరుచూ ఒకేరకం వంటకాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. మీల్ మేకర్ లతో రుచిగా, సులభంగా ఖీమా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సోయా ఖీమా తయారీకి కావల్సిన పదార్థాలు..
మీల్ మేకర్ – ముప్పావు కప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, లవంగాలు – 4, యాలకులు – 3, బిర్యానీ ఆకు – 1, అనాస పువ్వు – 1, మిరియాలు – 10, ఎండుమిర్చి – 1,తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 1/3 కప్పు, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, టమాటాలు – 2 ( మధ్యస్థంగా ఉన్నవి), పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, పచ్చిబఠాణీ – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – ముప్పావు కప్పు, గరం మసాలా – ఒక టీ స్పూన్, కసూరిమెంతి – ఒక టీ స్పూన్, ప్రెష్ క్రీమ్ – అర టేబుల్ స్పూన్, బటర్ – అర టేబుల్ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
సోయా ఖీమా తయారీ విధానం..
ముందుగా మీల్ మేకర్ లను వేడి నీటిలో వేసి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. తరువాత నీటిని పిండేసి ఈ మీల్ మేకర్ లను జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత టమాటాలను ఫ్యూరీలాగా చేసివేసుకోవాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత పెరుగు వేసి కలపాలి. దీనిని కూడా బాగా వేయించిన తరువాత పచ్చిబఠాణీ, మీల్ మేకర్ మిశ్రమం వేసి కలపాలి.
దీనిని 4 నిమిషాల పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఖీమా చక్కగా ఉడికిన తరువాత గరం మసాలా, కసూరిమెంతి, ప్రెష్ క్రీమ్, బటర్ వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సోయా ఖీమా తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, రోటీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన సోయా ఖీమాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.