Onion Kachori : సాయంత్రం సమయాల్లో మనకు రోడ్ల పక్కన బండ్ల మీద, హోటల్స్ లో లభించే చిరుతిళ్లల్లో ఆనియన్ కచోరి కూడా ఒకటి. ఆనియన్ కచోరి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. పచ్చిమిర్చితో కలిపి తింటే ఈ ఆనియన్ కచోరి మరింత రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ ఆనియన్ కచోరిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. చాలా తక్కువ సమయంలో వీటిని తయారు చేసుకోవచ్చు. బయట బండ్లమీద లభించే విధంగా ఆనియన్ కచోరిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ కచోరి తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – 2 కప్పులు, వాము – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, నెయ్యి – 2 టీ స్పూన్స్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, అటుకులు – పావు కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – 2 టీ స్పూన్స్, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, నిమ్మరసం – అర టీ స్పూన్, నూనె – డీప్ ప్రైకు సరిపడా.
ఆనియన్ కచోరి తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో వాము, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలను తీసుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన అన్నీ పదార్థాలు వేసి బాగా కలిపి పక్కకు ఉంచాలి. తరువాత ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల మైదాపిండి వేసి బాగా కలిపి పక్కకు ఉంచాలి. తరువాత ముందుగా కలిపిన పిండిని సమానంగా ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని చపాతీలా వత్తుకుని పక్కకు ఉంచాలి. ఇప్పుడు ముందుగా ఒక చపాతీని తీసుకుని దానిపై నెయ్యి మైదాపిండి మిశ్రమాన్ని రాసుకోవాలి.
తరువాత దీనిపై మరో చపాతీని వేసి మరలా నెయ్యి మైదాపిండి మిశ్రమాన్ని రాసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత పైన మరలా నెయ్యి మైదాపిండి మిశ్రమాన్ని రాసుకుని రోల్ చేసుకోవాలి. తరువాత దీనిని కొద్దిగా రోల్ చేస్తూ సాగదీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుని కచోరి పరిమాణంలో వత్తుకోవాలి. ఇందులో ఉల్లిపాయ మిశ్రమాన్ని ఉంచి అంచులను మూసేసి కొద్దిగా వెడల్పుగా వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కచోరీలను వేసి వేయించాలి. వీటిని మధ్యస్త మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియన్ కచోరి తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.