Karivepaku Kodi Vepudu : చికెన్ తో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో చికెన్ వేపుడు కూడా ఒకటి. చికెన్ వేపుడును చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే మనం వివిధ రుచుల్లో ఈ చికెన్ వేపుడును తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన వెరైటీ చికెన్ వేపుళ్లల్లో కరివేపాకు కోడి వేపుడు కూడా ఒకటి. ప్రత్యేకంగా తయారు చేసిన కరివేపాకు పొడి వేసి చేసే ఈ చికెన్ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా వెరైటీగా చికెన్ వేపుడుని తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. బ్యాచిలర్స్, మొదటిసారి చేసే వారు కూడా ఈ చికెన్ వేపుడును సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే కరివేపాకు కోడి వేపుడును ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు కోడి వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – అర కప్పు, కరివేపాకు – 3 రెమ్మలు, పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, పసుపు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టిన చికెన్ – ముప్పావు కిలో, వేయించిన జీడిపప్పు – పావు కప్పు.
మసాలా పొడికి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఎండుమిర్చి – 20, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి రెబ్బలు – 15, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, మరాఠీ మొగ్గ – 1, అనాస పువ్వు – 1, లవంగాలు – 8, జీలకర్ర – ఒక టీ స్పూన్, జాపత్రి – కొద్దిగా, యాలకులు – 6, కరివేపాకు – 50 గ్రా..
కరివేపాకు కోడి వేపుడు తయారీ విధానం..
ముందుగా మసాలా పొడి తయారీ కోసం కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత మిగిలిన మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి పొడిగా చేసుకుని పక్కకు ఉంచాలి. తరువాత వేపుడుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత చికెన్ వేసి పెద్ద మంటపై 4 నిమిషాల పాటు వేయించాలి.
తరువాత మంటను మధ్యస్థంగా చేసి మిక్సీ పట్టుకున్న పొడి వేసి కలపాలి. ఈ చికెన్ ను మధ్యస్థ మంటపై మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ లోని నీరంతాపోయి ముక్క వేగి నూనె పైకి తేలే వరకు వేయించాలి. చికెన్ పూర్తిగా వేగిన తరువాత జీడిపప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరివేపాకు కోడి వేపుడు తయారవుతుంది. దీనిని పప్పు చారుతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన కరివేపాకు కోడి వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.