Drinking Water and Kidneys : మన శరీరానికి నీరు ఎంతో అవసరం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగాలని నిపుణులు చెబుతూ ఉంటారు. నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. మలబద్దకం సమస్య ఉండదు. పొట్ట, ప్రేగులు శుభ్రపడతాయి. మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే మనలో చాలా మందికి నీటి గురించి ఒక సందేహం ఉంటుంది. రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగడం వల్ల మూత్రపిండాలపై అధికంగా ఒత్తిడి పడుతుందని మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. కొందరైతే ఎక్కువగా నీటిని తాగే వారికి అలా ఎక్కువగా నీటిని తాగడం మంచిది కాదని ఉచితంగా సలహాలు ఇస్తూ ఉంటారు కూడా.
అయితే రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగడం వల్ల నిజంగానే మూత్రపిండాలపై ఎక్కువగా ఒత్తిడి పడుతుందా… ఎక్కువగా నీటిని తాగడం మంచిది కాదా.. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుందే తప్ప మూత్రపిండాలపై ఒత్తిడి పడదని నిపుణులు చెబుతున్నారు. మనం తాగిన నీరు నేరుగా మూత్రపిండాలకు చేరదని నిపుణులు చెబుతున్నారు. మనం నీటిని తాగిన గంట నుండి గంటన్నర తరువాత మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. మనం తాగే నీరు నేరుగా మూత్రపిండాలకు చేరితే వెంటనే మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంది. కానీ మనం నీటిని తాగిన గంట తరువాత మాత్రమే మూత్రవిసర్జనకు వెళ్తున్నామని కనుక మనం తాగే నీరు మూత్రపిండాలపై ఎటువంటి చెడు ప్రభావాన్ని చూపించదని నిపుణులు చెబుతున్నారు.
మనం తాగిన నీటిని ముందుగా ప్రేగులు పీల్చుకుని రక్తంలోకి పంపిస్తాయి. రక్తం ఈ నీటిని కాలేయానికి చేరవేస్తుంది. కాలేయం ఈ నీటిలో ఉండే క్రిములను నశింపజేస్తుంది. తరువాత ఈ నీరు రక్తం గుండెకు చేరుతుంది. గుండె ఈ నీటిని, రక్తాన్ని శరీరం అంతటా పంపింగ్ చేస్తుంది. మనం తాగే నీరు ముందుగా మన శరీరంలో కలిసి ఆ తరువాత శరీర భాగాల్లో ఉండే వ్యర్థ పదార్థాలను మోసుకుని మూత్రపిండాలకు చేరుతాయి. ఈ విధంగా మనం తాగే నీరు చాలా సమయం తరువాత మూత్రపిండాలకు చేరుతుంది. మనం నీటిని ఎక్కువగా తాగితేనే మన శరీరం ఎక్కువగా ఉన్న నీటిని మూత్రం ద్వారా బయటకు పంపుతుంది.
మనం మూత్రవిసర్జన చేస్తేనే మన శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. మనం రోజూ రెండు నుండి రెండున్నర లీటర్ల మూత్రాన్ని విసర్జించాలి. మూత్రం ఎప్పుడూ కూడా తెల్లగా ఉండాలి. మూత్రం తెల్లగా ఉంటేనే మన శరీరంలో తగినంత నీరు ఉందని అర్థం. ఒకవేళ మూత్రం కంటికే పసుపు రంగులో కనిపిస్తే మనం నీటిని తాగడం లేదని మన శరీరంలో తగినంత నీరు లేదని అర్థం. నీరు తగినంత తాగకపోతే మూత్రపిండాలు వ్యర్థాలను సరిగ్గా బయటకు పంపించలేవని కనుక మనం నీటిని ఎక్కువగా తాగాలని నీటిని ఎక్కువగా తాగడం వల్ల మూత్రపిండాలపై ఎటువంటి ఒత్తిడి పడదని నిపుణులు చెబుతున్నారు.