Kothimeera Nimmakaya Karam : కొత్తిమీర నిమ్మకాయ కారం.. నిమ్మరసం, కొత్తిమీర కలిపి చేసే ఈ కారం చాలా రుచిగా ఉంటుంది. కొత్తిమీర టేస్ట్ తో పుల్ల పుల్లగా ఉండే ఈ కారాన్ని అందరూ ఇష్టంగా తింటారు. ఇడ్లీ, దోశ వంటి అల్పాహారాలతో తినడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ కారాన్ని తయారు చేసుకోవడం చాలా సులభం. చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో ఎవరైనా దీనిని తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ కొత్తిమీర నిమ్మకాయ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర నిమ్మకాయ కారం తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – 2 టీ స్పూన్స్, మినపప్పు – 2 టీ స్పూన్స్, మెంతులు – ఒక టీ స్పూన్, నూనె – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టీస్పూన్, ఎండుమిర్చి – 10 నుండి 15, వెల్లుల్లి రెమ్మలు – 4, జీలకర్ర – ఒక టీ స్పూన్, అల్లం – ఒక చిన్న ముక్క, తరిగిన నాటు కొత్తిమీర – 2 కట్టలు( 100 గ్రా.), ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, నిమ్మకాయలు – 2.
కొత్తిమీర నిమ్మకాయ కారం తయారీ విధానం..
ముందుగా కళాయిలో శనగపప్పు, మినపప్పు, మెంతులు వేసి మాడిపోకుండా దోరగా వేయించాలి. తరువాత నూనె వేసి కలపాలి. తరువాత ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వెల్లుల్లి రెమ్మలు, అల్లం,జీలకర్ర వేసి కలిపి చల్లారే వరకు ఉంచాలి. ఇవన్నీ చల్లారిన తరువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర, పసుపు, ఉప్పు, వేడి నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.తరువాత నిమ్మరసం వేసి కలిపి గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర నిమ్మకాయ కారం తయారవుతుంది. ఈ కారాన్ని అందరూ ఇష్టపడతారని చెప్పవచ్చు. వెరైటీ రుచులు కోరుకునే వారు అప్పుడప్పుడూ ఇలా కొత్తిమీర నిమ్మకాయ కారాన్ని తయారు చేసి తీసుకోవచ్చు.