Dosakaya Tomato Roti Pachadi : దోసకాయ టమాట రోటి పచ్చడి.. దోసకాయ, టమాటాలు కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతాయని చెప్పవచ్చు. తరుచూ చేసే దోసకాయ పచ్చడి కంటే ఈ పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని అందరూ ఇష్టపడతారని చెప్పవచ్చు. అలాగే ఎవరైనా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా, పుల్ల పుల్లగా, కమ్మగా ఉండే ఈ దోసకాయ టమాట రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ టమాట రోటి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి – 6, తరిగిన టమాటాలు – 2, తరిగిన దోసకాయ – పావుకిలో, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు – 6.
దోసకాయ టమాట రోటి పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, ధనియాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత వీటిని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో టమాటాలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత దోసకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలు మెత్తగా అయ్యే వరకు మగ్గించాలి. ముక్కలు మగ్గిన తరవాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత రోటిని తీసుకుని అందులో వేయించిన దినుసులు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి.
తరువాత మగ్గించిన దోసకాయ, టమాట ముక్కలు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండేలా దంచుకోవాలి. తరువాత వెల్లుల్లి రెమ్మలు వేసి దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోసకాయ టమాట రోటి పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని అందరూ లొట్టలేసుకుంటూ తింటారు.