Dehydration Health Tips : ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎండ తీవ్రత కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. వేసవి కాలంలో ఎండ నుండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మం హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం. వేసవి కాలంలో శరీరంలో తగినంత నీరు లేకపోతే మనం తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. వేసవికాలంలో మనం రోజంతా హైడ్రెటెడ్ గా ఎలా ఉండాలి.. దీని కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దాహం వేయకముందే నీటిని తాగాలి. మనకు దాహం వేసిందంటే మన శరీరంలో తగినంత నీరు లేదని దాని అర్థం. కనుక మనం దాహం వేయక ముందే క్రమం తప్పకుండా నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే బయటకి వెళ్లినప్పుడు వాటర్ బాటిల్ ను తీసుకెళ్లి నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, ఖర్బూజ, కీరదోస, నారింజ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవాలి.
వీటిని తీసుకోవడం వల్ల నీటితో పాటు శరీరానికి అవసరమయ్యే ఖనిజాలు, విటమిన్స్, పోషకాలు కూడా లభిస్తాయి. అలాగే ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉండే కొబ్బరి నీళ్లు, అరటిపండ్లు, ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని రకాల శీతల పానీయాలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల ఎండ వల్ల శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి అందుతాయి. అలాగే వేసవికాలంలో చర్మానికి గాలి తగిలేలా, చెమట త్వరగా ఆరిపోయే దుస్తులను ధరించాలి. ముఖ్యంగా తెల్లటి దుస్తులు, పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించాలి. వీటిని ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. తద్వారా శరీరం నీటిని ఎక్కువగా కోల్పోకుండా ఉంటుంది. మనం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాము. అదే విధంగా ఎండలో బయట తిరగాల్సి వస్తే వీలైనంత వరకు నీడలో ఉండేలా చూసుకోవాలి. నేరుగా శరీరంపై సూర్యరశ్మి పడకుండా చూసుకోవాలి. ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లో పాల్గొనాల్సి వస్తే మాత్రం మధ్యలో విరామం తీసుకుని కొద్ది సమయం నీడలో ఉండేలా చూసుకోవాలి.
అలాగే వేసవికాలంలో ఆల్కహాల్ మరియు కెఫిన్ కలిగిన పానీయాలను తక్కువగాతీసుకోవాలి. ఇవి శరీరం త్వరగా నిర్జలీకరణం అయ్యేలా చేస్తాయి. కనుక వేసవికాలంలో వీటికి దూరంగా ఉండడం మంచిది. అదే విధంగా మూత్ర విసర్జన సమయంలో మూత్రం రంగుపై తగిన శ్రద్ద వహించాలి. మూత్రం లేత పసుపు రంగులో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే మన శరీరంలో డీహైడ్రేషన్ కు గురి అయ్యిందని అర్థం. అలాగే మనం వాడే కొన్ని రకాల మందులు కూడా శరీరం త్వరగా నిర్జలీకరణంగా అయ్యేలా చేస్తాయి. కనుక వైద్యున్ని సంప్రదించి తగిన మందులు వాడడం అవసరం. ఈ విధంగా వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శరీరం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.