7 Supplements : మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, మనం మన రోజు వారి పనులను చక్కగా చేసుకోవాలన్నా మన శరీరానికి ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ తో పాటు ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ఈ పోషకాలన్నీ చక్కగా అందినప్పుడే మన శరీరం తన విధులను సక్రమంగా నిర్వర్తించగలదు. అంతేకాకుండా మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ మనం సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. అయితే సమతుల్య ఆహారాన్ని తీసుకున్నప్పటికి కూడా కొందరిలో పోషకాహార లోపాలు వస్తూ ఉంటాయి. పోషకాహార లోపాలు రాకుండా ఉండాలంటే సమతుల్య ఆహారంతో పాటు ఈ ఏడు రకాల సప్లిమెంట్స్ ను కూడా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల పోషకాహార లోపాలు భర్తీ చేయబడతాయి. శరీరం ఆరోగ్యంగా ఉండడంతో పాటు శక్తివంతంగా కూడా తయారవుతుంది.
మన శరీరానికి రోజూ అవసరమయ్యే ఏడు రకాల సప్లిమెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం రోజూ తీసుకోదగిన సప్లిమెంట్స్ లో మల్టీ విటమిన్స్ కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. ఇవి మన శరీరం మొత్తం ఆరోగ్యానికి తోడ్పతాయి. అలాగే మనం విటమిన్ డి క్యాప్సుల్స్ ను తీసుకోవడం కూడా చాలా అవసరం. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, మానసికస్థితిని నియంత్రించడంలో, ఎముకలను ధృడంగా ఉంచడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. మనకు రోజుకు 600 నుండి 800 ఐయు( ఇంటర్నేషనల్ యూనిట్స్) మొత్తంలో విటమిన్ డి అవసరమవుతుంది. అయితే అందరికి ఎండ ద్వారా ఇంత మొత్తంలో విటమిన్ డి లభించదు కనుక విటమిన్ డి క్యాప్సుల్స్ ను తీసుకోవడం మంచిది.
అలాగే ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ ను తీసుకోవడం కూడా చాలా అవసరం. పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రోబయోటిక్స్ చాలా అవసరమవుతాయి. కనుక విభిన్న శ్రేణి బ్యాక్టీరియా జాతులతో చేయబడిన ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ ను తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇక మన శరీరానికి మెగ్నీషియం కూడా చాలా అవసరం. శక్తి ఉత్పత్తికి, కండరాల పనితీరును మెరుగుపరచడంతో పాటు శరీరంలో 300 రకాల జీవక్రియలకు మెగ్నీషియం అవసరమవుతుంది. రోజుకు మనకు 300 నుండి 400 మిల్లీ గ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది. ఇంత మొత్తంలో ఆహారం ద్వారా శరీరానికి మెగ్నీషియం అందని వారు మెగ్నీషియం సప్తిమెంట్స్ ను తీసుకోవడం మంచిది. ఇక మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒకటి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటిని ఆహారం ద్వారా తీసుకోలేని వారు సప్లిమెంట్స్ రూపంలో తీసుకునే ప్రయత్నం చేయాలి.
మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో విటమిన్ బి12 కూడా ఒకటి. నరాల పనితీరుకు, ఎర్ర రక్తకణాల తయారీకి ఇలా అనేక రకాలుగా విటమిన్ బి12 అవసరమవుతుంది. ఇది ఎక్కువగా జంతు సంబంధిత ఆహారాల్లో ఉంటుంది. కనుక శాఖాహారులు విటమిన్ బి12 సప్లిమెంట్స్ ను తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మనం రోజూ ఎలక్ట్రోలైట్ సప్లిమెంట్స్ ను తీసుకోవాలి. కండరాల పనితీరుకు, నరాల సరైన పనితీరుకు ఇవి చాలా అవసరం. చెమట ఎక్కువగా పట్టినప్పుడు ఎలక్ట్రోలైట్స్ ను శరీరం ఎక్కువగా కోల్పోతుంది. కనుక ఎలక్ట్రోలైట్ సప్లిమెంట్స్ ను తీసుకోవడం మంచిది. ఈ విధంగా మనం రోజూ ఈ ఏడు రకాల సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల ఆహారం ద్వారా అందని పోషకాలు కూడా చక్కగా అందుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.