Yoga Asanas In Summer : ఫిట్ గా ఉండాలని, చక్కటి శరీర ఆకృతిని కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ అందరూ వాటికి తగినట్టు వ్యాయామాలు చేయలేరు. బరువైన, కష్టమైన వ్యాయామాలను అందరూ చేయలేరు. అందరి శరీరతత్వం ఒకేలా ఉండదు. అలాగే అందరికి ఈ కష్టమైన వ్యాయామాలు చేసేంత సమయం కూడా ఉండదు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే యోగాసనాలు వేయడం వల్ల శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవచ్చు. అలాగే ఇవి చాలా సులభమైనవి. ఎవరైనా చాలా సులభంగా ఈ ఆసనాలను వేయవచ్చు. అలాగే ఈ ఆసనాలను వేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. వేసవికాలంలో కష్టమైన వ్యాయామాలు చేయడానికి బదులుగా ఈ ఆసనాలు వేయడం వల్ల శరీరానికి చక్కటి విశ్రాంతి కూడా లభిస్తుంది. శరీరాన్ని ఫిట్ గా ఉంచే ఆసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకు అనేక ప్రయోజనాలను అందించే ఆసనాల్లో మత్య్స ఆసనం కూడా ఒకటి. దీనిని చేప భంగిమ అని కూడా అంటారు.
ఈ ఆసనం వేయడం వల్ల మెడ ధృడంగా తయారవుతుంది. శ్వాస తీసుకోవడాన్ని మెరుగుపరచడంలో, విశ్రాంతిని ప్రోత్సహించడంలో ఇలా అనేక రకాలుగా ఈ ఆసనం మనకు సహాయపడుతుంది. అలాగే వృక్షాసనాన్ని కూడా సులభంగా వేయవచ్చు. దీనిని ట్రీపోజ్ అని కూడా అంటారు. కాలు కండరాలను, తొడలను ధృడంగా చేయడంలో, శరీర సమతుల్యాన్ని మెరుగుపరచడంలో, ఏకాగ్రతను మెరుగుపరచడంలో, మనసుకు ప్రశాంతతను, విశ్రాంతిని కలిగించడంలో ఈ ఆసనం మనకు సహాయపడుతుంది. అలాగే శవాసనం కూడా మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నిటారుగా పండుకుని కాళ్లను వెడల్పుగా, చేతులను శరీరం నుండి దూరంగా ఉంచాలి. ఒత్తిడిని తగ్గించడంలో, శరీరాన్ని శాంతపరచడంలో, శరీరానికి విశ్రాంతిని కలిగించడంలో ఈ ఆసనం ఎంతో తోడ్పడుతుంది. అదే విధంగా శరీరాన్ని, మనసును ధృడంగా ఉంచడంలో పద్మాసనం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని లోటస్ పోజ్ అని కూడా అంటారు.
శరీరంలో శక్తి ప్రవాహాన్ని మెరుగుపరచడంలో, శరీరం ఆరోగ్యం మరియు శ్రేయస్సును పెంపొందించడంలో ఈ పద్మాసనం మనకు ఎంతో సహాయపడుతుంది. ఇక సుఖాసనం వేయడం వల్ల కూడా మనం మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ధ్యానం చేసే వారు ఎక్కువగా ఈ ఆసనాన్ని వేస్తూ ఉంటారు. ఒత్తిడిని తగ్గించడంలో, ఏకాగ్రతను పెంచడంలో ఈ ఆసనం మనకు ఉపయోగపడుతుంది. అలాగే మర్జారియాసనా లేదా పిల్లి భంగిమ వేయడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల ఎండార్ఫిన్ ఎక్కువగా విడుదల అవుతుంది. దీంతో ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. వేసవికాలంలో ఈ ఆసనం మన శరీరానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది. అలాగే బుద్ద కోనాసనం దీనినే సీతాకోకచిలుక భంగిమ అని అంటారు. ఈ ఆసనం వేయడం వల్ల శ్వాస మీద నియంత్రణ వస్తుంది. వెన్నెముక ధృడంగా తయారవుతుంది.
ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఉస్త్రాసనం వేయడం వల్ల కూడా మనకు ఎంతో మేలు కలుగుతుంది. దీనిని ఒంటె భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం వేయడం వల్ల వీపు ధృడంగా తయారవుతుంది. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ ఆసనం మనకు ఎంతో సహాయపడుతుంది. అదే విధంగా నౌకాసనం కూడా మన శరీరానికి మేలు చేస్తుంది. దీనిని పరిపూర్ణ నవసన లేదా పడవ భంగిమ అని కూడా అంటారు. శరీర సమతుల్యాన్ని మరియు స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో, కండరాలను ధృడంగా చేయడంలో ఈ ఆసనం మనకు ఎంతో దోహదపడుతుంది. ఇక వీరభద్రాసనం వేయడం వల్ల కూడా మనం మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ ఆసనం వేయడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. పొట్ట భాగంలో కండరాలు ధృడంగా తయారవుతాయి. శరీర సమతుల్యత పెరుగుతుంది. ఈ విధంగా ఈ ఆసనాలు వేయడం వల్ల శరీరం ధృడంగా, ఫిట్ గా తయారవ్వడంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.