Munaga Puvvu Pesara Pappu Kura : మునక్కాయలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటితో చారు, టమాటా కూర చేయవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే మునగ పువ్వుతోనూ మనం పలు రకాల వంటకాలను చేయవచ్చు. ముఖ్యంగా ఈ పువ్వులో పెసరపప్పు వేసి వండితే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ఈ కూర తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మునగ పువ్వు, పెసరపప్పు కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
మునగ పువ్వు – 1 కప్పు, లేత మునగాకు – అర కప్పు, ఉల్లిపాయ – 1, పెసర పప్పు – పావు కప్పు, నూనె – 2 టీస్పూన్లు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు – 10, పసుపు – పావు స్పూన్, తాళింపు దినుసులు – ఆవాలు, పచ్చి శనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర.
మునగ పువ్వు, పెసర పప్పు కూర తయారు చేసే విధానం..
ముందుగా బాండీలో నూనె వేసి వేడి చేసి తాళింపు దినుసులు దోరగా వేగిన తరువాత వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి ఒకసారి తిప్పి మూత పెట్టి ఉడికించాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తరువాత మునగ పువ్వు, మునగాకు వేసి కలిపి మూత పెట్టి మూడు నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి నానబెట్టిన పెసర పప్పు వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లాలి. అంతే.. ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు, మునగ పువ్వు కూర రెడీ అవుతుంది. దీన్ని అన్నం లేదా చపాతీలు.. ఎందులో తిన్నా సరే రుచిగానే ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.