Munagaku Podi Idli : ఇడ్లీలు అంటే ఇష్టం ఉండనిది ఎవరికి చెప్పండి. అందరూ ఇడ్లీలను ఇష్టంగానే తింటారు. సాంబార్ లేదా కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, టమాటా చట్నీలతో ఇడ్లీలను తింటుంటే వచ్చే మజాయే వేరు. అందుకనే చాలా మంది ఫేవరెట్ టిఫిన్‌గా ఇడ్లీ మారింది. అయితే ఇడ్లీలను ఇంకా ఆరోగ్యకరంగా తయారు చేసుకుని తింటే దాంతో రుచికి రుచి పోషకాలకు పోషకాలు కూడా లభిస్తాయి. ఇక ఇడ్లీలను ఆరోగ్యకరంగా ఎలా చేయాలంటే.. వాటిపై కాస్త మునగాకు పొడి చల్లాలి. దీంతో ఇడ్లీలు మరింత రుచిగా ఉండడమే కాదు, మనకు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఇక మునగాకుల పొడిని ఎలా తయారు చేయాలి, అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మునగాకులను కొన్ని తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. ఆకులు పొడిగా అయ్యాక వాటిని పెద్ద పెనంపై వేసి వేయించాలి. ఆకులు క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. అనంతరం వాటిని పక్కన పెట్టాలి. ఇంకో పాన్ తీసుకుని అందులో శనగలు, మినన పప్పు, నల్ల మిరియాలు, జీలకర్ర, నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేయాలి. అవి బంగారు గోధుమ రంగులోకి మారే వరకు వాటిని వేయించాలి. అనంతరం వాటిని తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి.
మునగాకుల పొడి తయారీ ఇలా..
అలాగే ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చిలను వేసి కొన్ని నిమిషాల పాటు వేయించాలి. వెల్లుల్లి గోధుమ రంగులోకి మారాక స్టవ్ ఆఫ్ చేయాలి. వేయించుకున్న అన్ని పప్పులను బ్లెండర్లో వేయాలి. అలాగే అన్ని సీడ్స్, వెల్లుల్లి, మిర్చిని కూడా వేయాలి. అనంతరం అందులో చింతపండు, ఉప్పు వేయాలి. వీటన్నింటినీ మెత్తని పొడిలా పట్టుకోవాలి. తరువాత అందులోనే మునగాకులను కూడా వేసి మళ్లీ పొడిగా పట్టాలి. దీంతో మునగాకుల పొడి రెడీ అవుతుంది. ఇలా తయారు చేసిన మునగాకుల పొడి 2 నెలల వరకు నిల్వ ఉంటుంది.
అయితే మునగాకుల పొడిని నిల్వ ఉంటుంది కానీ దీన్ని వాడే ముందు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. ఇక మీరు రెగ్యులర్‌గా చేసే విధంగానే ఇడ్లీలను చేశాక ఒక పాన్ తీసుకుని అందులో కాస్త ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత అందులో ఇడ్లీలను వేయాలి. అనంతరం వాటిపై ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మునగాకుల పొడిని చల్లాలి. కాస్త వేయించాలి. దీంతో ఎంతో రుచికరమైన మునగాకు పొడి ఇడ్లీలు రెడీ అవుతాయి. వీటిని చట్నీ అవసరం లేకుండా నేరుగానే తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే ఈ ఇడ్లీలు మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తాయి.
ఈ ఇడ్లీలు ఎంతో ఆరోగ్యకరం..
ఇలా తయారు చేసుకున్న ఇడ్లీలు ఎంతో ఆరోగ్యవంతమైనవని చెప్పవచ్చు. ఎందుకంటే వీటిల్లో ముఖ్య పదార్థం మునగాకు. ఇది మనకు అనేక విధాలుగా లాభాలను అందిస్తుంది. మునగాకుల పొడిని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మునగాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కనుక ఈ పొడిని తింటే కొలెస్ట్రాల్ లెవల్స్, షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. అలాగే మలబద్దకం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా ఈ పొడితో ఓ వైపు చక్కని రుచిని ఆస్వాదిస్తూనే మరోవైపు ఆరోగ్యకరమైన లాభాలను పొందవచ్చు. కనుక ఇకపై మీరు ఇడ్లీలను చేస్తే మునగాకుల పొడితో కలిపి తినండి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందండి.