మనకు సాధారణ అరటి పండ్లతోపాటు కూర అరటికాయలు కూడా మార్కెట్‌లో లభిస్తాయి. అవి పచ్చిగా ఉంటాయి. అరటికాయల్లో అదొక వెరైటీ. వాటితో చాలా మంది కూరలు చేసుకుంటారు. ఎక్కువ శాతం మంది ఫ్రై లేదా పులుసు చేసుకుని తింటారు. అయితే నిజానికి కూర అరటికాయల్లోనూ పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* సాధారణ అరటి పండ్ల కన్నా కూర అరటి కాయల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అందువల్ల వీటిని తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ సమస్యలు ఉండవు.
* సాధారణ అరటి పండ్లలాగే కూర అరటి కాయల్లోనూ పొటాషియం అధికంగా ఉంటుంది. దీని వల్ల హైబీపీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా నివారించవచ్చు. గుండె జబ్బులు వచ్చిన వారు కూర అరటికాయలతో వంటలు చేసుకుని తింటే మంచిది. దీంతో గుండె సురక్షితంగా ఉంటుంది.
* ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక కూర అరటికాయలతో బరువు సులభంగా తగ్గవచ్చు. అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి ఆహారం అని చెప్పవచ్చు.
* కూర అరటి కాయల్లో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా పొటాషియం, విటమిన్ సి, బి6 అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా రక్షిస్తాయి.
* కూర అరటి కాయల గ్లైసీమిక్ ఇండెక్స్ కేవలం 30 మాత్రమే. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఇవి మంచి ఆహారం. వీటిని తింటే షుగర్ లెవల్స్ పెరగవు. తగ్గుతాయి. కనుక వీటిని తరచూ తినాలి.
* ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్, మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారు ఈ అరటికాయలను ఉడకబెట్టి అందులో కొద్దిగా ఉప్పు కలుపుకుని తింటే మంచిది. దీంతో ఆయా సమస్యలు తగ్గుతాయి.