Spending Time In The Sun : భూమిపై ఉన్న సమస్త ప్రాణికోటికి సూర్యుడు వెలుగునిస్తాడు. సూర్యుడు కనుక లేకపోతే జీవుల మనుగడే లేదు. అందుకనే మన పురాణాల్లోనూ సూర్యున్ని దేవుడిగా కొలిచారు. సూర్య భగవానుడి పేరిట చాలా మంది రోజూ ఉదయం సూర్యోదయం సమయంలో, సూర్యాస్తమయం సమయంలో పూజలు చేస్తుంటారు. అయితే మీకు తెలుసా..? రోజూ కాస్త సమయాన్ని ఎండలో గడపడం వల్ల మన మానసిక సమస్యలు అన్నీ దూరమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేదా మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో కాసేపు సూర్య రశ్మి తగిలేలా ఉంటే చాలు, మానసిక సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని వారు అంటున్నారు.
వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం రోజూ కాస్త సేపు సూర్యరశ్మిలో గడిపితే మన శరీరంలో సెరొటోనిన్ అనే న్యూరో ట్రాన్స్‌మిటర్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది మన మూడ్‌ను మారుస్తుంది. మనల్ని హ్యాపీగా, ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అందుకనే సెరొటోనిన్‌ను హ్యాపీ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇక సూర్యరశ్మి శరీరానికి తగలడం వల్ల సెరొటోనిన్ స్థాయిలు మన శరీరంలో పెరిగి డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.
జీవ గడియారం పనితీరుకు..
మనిషికి జీవ గడియారం అనేది ఉంటుంది. దీన్నే సర్కేడియన్ రిథమ్ అంటారు. ఇది మనకు ఏం సమయంలో ఏం చేయాలో చెబుతుంది. అందుకనే మనకు రాత్రి కాగానే ఆటోమేటిగ్గా నిద్ర వస్తుంది. ఉదయం అవగానే మెళకువ వస్తుంది. కానీ కొందరు రాత్రి ఆలస్యంగా నిద్రిస్తూ ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తుంటారు. దీంతో జీవ గడియారం పనితీరు దెబ్బ తింటుంది. ఇది అనేక వ్యాధులను కలగజేస్తుంది. అయితే రోజూ కాస్త సేపు ఎండలో గడిపితే చాలు, జీవ గడియారం మళ్లీ యథావిధిగా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. కనుక ప్రతి ఒక్కరూ రోజూ ఎండలో కాసేపు తిరగాలి. దీంతో అనేక లాభాలు పొందవచ్చు.
ఎండలో తిరగడం వల్ల శరీరంలో విటమిన్ డి లెవల్స్ కూడా పెరుగుతాయి. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గుతారు. మనం తినే ఆహారంలో ఉండే క్యాల్షియంను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. దీంతో ఎముకలు, దంతాలు బలంగా మారుతాయి. ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే రోజూ సూర్య రశ్మిలో కాసేపు ఉండడం వల్ల సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ (SAD) అనే వ్యాధి రాకుండా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సూర్య రశ్మి అసలు తగలని వారికి ఈ వ్యాధి వస్తుందట. దీంతో ఇలాంటి వారు ఎల్లప్పుడూ మూడీగా ఉంటారట. విచారంగా కనిపిస్తారట. కానీ వారు సూర్య రశ్మిలో గడిపితే ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇక సూర్య రశ్మిలో గడపడం వల్ల ఒత్తిడి, ఆందోళన సైతం తగ్గుతాయని, కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించాలని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి సూర్య రశ్మిలో గడపండి. మానసికంగా ఆరోగ్యంగా ఉండండి.