ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎప్పుడు అనేక ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడుతూ వార్తలలో నిలుస్తూ ఉంటారు. అయితే తాజాగా సద్గురు జగ్జీ వాసుదేవ్ ను మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. మహిళలను ఎందుకు సన్యాసినులుగా మారేలా ప్రేరేపిస్తున్నారని హైకోర్టు అడిగింది. ఓ కేసులో కోర్టు ఆ ప్రశ్న వేసింది. తన స్వంత కూతురి పెళ్లి చేసిన సద్గురు, ఎందుకు ఇతర అమ్మాయిలను సన్యాసం వైపు మళ్లిస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. తన కుమార్తెకు వివాహం చేసి, ఆమె జీవితంలో బాగా స్థిరపడాలని కోరుకున్న సద్గురు.. ఇతరు అమ్మాయిల విషయంలో ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియన్, జస్టిస్ వి.శివజ్ఞానంల ధర్మాసనం ప్రశ్నించింది.
కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేసిన ఎస్ కామరాజ్.. తన కుమార్తెలను సద్గురు జుత్తు కత్తిరించుకుని, ప్రాపంచిక జీవితాలను త్యజించాలంటూ ప్రోత్సహించడాన్ని సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. 42, 39 ఏళ్లు ఉన్న ఇద్దరు మహిళలు ఆ కేసులో ఇవాళ కోర్టు ముందు హాజరయ్యారు. అయితే తమ ఇష్ట ప్రకారమే ఈషా ఫౌండేషన్‌లో ఉంటున్నట్లు చెప్పారు. తమను ఎవరూ బంధించలేదని చెప్పారు. కూతుళ్లు వదిలి వెళ్లడం వల్ల తమ జీవితం దుర్భరమైనట్లు ఆ పేరెంట్స్ కోర్టుకు వెల్లడించారు. అయితే ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టాలని జడ్జీ సూచించారు.ఇషా ఫౌండేషన్‌కు సంబంధించిన అన్ని కేసుల జాబితాను సమర్పించాలని పోలీసుల్ని ఆదేశించారు.
ఈ సందర్భంగానే తన కూతురికి పెళ్లి చేసి జీవితంలో స్థిరపడేలా చేసిన వ్యక్తి (సద్గురు) ఇతరుల కూతుళ్లను తల దించుకుని సన్యాసి జీవితాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడో తెలుసుకోవాలని జస్టిస్ శివజ్ఞానం తెలిపారు..కాగా, ఈ విషయంలో తమకు మరిన్ని సందేహాలు ఉన్నాయన్న న్యాయస్థానం.. ఇషా ఫౌండేషన్‌పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను అక్టోబరు 4కి వాయిదా వేసింది. అయితే ఇషా ఫౌండేషన్ తరఫున హాజరైన న్యాయవాది.. ‘వయోజనులు తమ మార్గాలను ఎంచుకునే స్వేచ్ఛ, జ్ఞానం కలిగి ఉంటారని మేము నమ్ముతున్నాం… మేము పెళ్లి చేసుకోవద్దని లేదా సన్యాసం తీసుకోమని బలవంతం చేయడం లేదు.. ఇవి వ్యక్తిగత ఎంపిక. బ్రహ్మచార్యం లేదా సన్యాసాన్ని స్వీకరించిన కొద్దిమందితో పాటు సన్యాసులు కాని వేలమందికి ఇషా యోగా సెంటర్ వసతి కల్పిస్తుంది’ అని చెప్పారు.