Almonds : పాలను రోజూ తాగడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తాగడం వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. కనుకనే పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. అయితే రాత్రి పూట కేవలం పాలను మాత్రమే కాకుండా.. కొన్ని బాదంపప్పులను కూడా తీసుకోవడం వల్ల మనకు ఇంకా అనేక లాభాలు కలుగుతాయి. రాత్రి 7 లేదా 8 బాదం పలుకులను తిని తరువాత ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే ఎన్నో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఇలా తాగడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదంపప్పులను తిని పాలను తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే జ్వరం కూడా తగ్గుతుంది. ఇక బాదంపప్పు, పాలు.. రెండింటిలోనూ కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. దీని వల్ల శరీరానికి శక్తి అందుతుంది. అలసిపోకుండా ఉంటారు. అలాగే ఎముకలు దృఢంగా ఉంటాయి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచే సరికి బద్దకం ఉండదు. యాక్టివ్‌గా ఉంటారు.
మలబద్దకం సమస్య ఉన్నవారు బాదం పప్పును తిని పాలు తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. దీంతోపాటు జీర్ణక్రియ మెరుగు పడుతుంది. రాత్రి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్ సమస్య ఉండదు. బాదంపప్పులను తిని పాలు తాగడం వల్ల శరీరానికి శక్తి లభించి ఒత్తిడి తగ్గుతుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు బాదంపప్పులను తిని పాలను తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్ర సరిగ్గా పడుతుంది. అలాగే బాదంపప్పును తిని పాలను తాగితే పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. దీంతో శృంగారంలో చురుగ్గా పాల్గొంటారు. సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి. కనుక ఇలా ఈ రెండింటినీ రోజూ తీసుకోవాలి.