పాలసీలు, బ్యాంక్ అకౌంట్స్, డీమాట్ అకౌట్స్, బాండ్స్, షేర్స్ ఇలా ఆర్ధిక లావా దేవీలలో నామినీ పేరు చేర్చడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా చేర్చడం వలన అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయి. అయితే ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతాకు నామినీ లేకపోతే, అతని మరణం తర్వాత, డబ్బు ఎవరికి వెళుతుందనేది చాలా మందిలో ధర్మ సందేహంగా మారుతుంది. నిజానికి ఏదైన అకౌంటు ఖాతాదారుడు మరణిస్తే, డిపాజిట్ చేసిన డబ్బు నామినీకి లభిస్తుంది. ఖాతాదారుడు మరణిస్తే, అతని ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బు అంత నామినికే చెందుతుంది. ఒకటి కన్నా ఎక్కువ మంది నామినీలు ఉంటే అది షేర్ చేయడం జరుగుతుంది. అనేక బ్యాంకులు అటువంటి సదుపాయాన్ని కూడా అందిస్తున్నాయి. దీనిలో మీరు ఒకటి కంటే ఎక్కువ మంది నామినీలను చేయవచ్చు.
మరణం తర్వాత ఏ వ్యక్తికి ఎంత వాటా ఇవ్వాలో కూడా పేర్కొనవచ్చు.ఈ పద్ధతి ద్వారా డబ్బు పంపిణీ సందర్భంలో కుటుంబంలో ఎటువంటి వివాదాలు తలెత్తవు. ఒకవేళ నామినీని పేర్కొనకపోతే డబ్బు ఎవరికి ఇస్తారు అనే సందేహం అందరిలో ఉంటుంది. బ్యాంక్ అకౌంట్‌లో నామినీ వివరాలను పేర్కొనని పక్షంలో, మరణం తర్వాత డబ్బు అతని చట్టబద్ధమైన వారసులకి వెళ్తుంది. వివాహితుడైన వ్యక్తి విషయంలో అతని వారసులుగా భార్య, పిల్లలు, తల్లిదండ్రులను పరిగణిస్తారు. ఒకవేళ పెళ్లికాని వ్యక్తి విషయంలో తల్లిదండ్రులు లేదా తోబుట్టువులను వారసులుగా పరిగణిస్తారు. వారు అకౌంట్ హోల్డర్‌కు సంబంధించిన డబ్బును క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు, ఒక వ్యక్తి తన భార్య, తల్లి, సోదరిని తన బ్యాంకు ఖాతాకు నామినీగా చేశాడు. ఏ కారణం చేతనైనా ఆ వ్యక్తి చనిపోతే అతని బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బు మొత్తం అతని భార్య, తల్లి, సోదరికి సమానంగా పంచుతారు. మరో ఉదాహరణలో ఒక వ్యక్తి తన బ్యాంక్ ఖాతా కోసం 3 మందిని నామినీలుగా కూడా చేసాడు. అయితే నామినేషన్ వేసేటప్పుడు, ఆ వ్యక్తి మరణించిన తర్వాత, తన ఖాతాలో జమ చేసిన డబ్బులో 50 శాతం తన భార్యకు ఇవ్వాలని 25-25 శాతం తన తల్లి సోదరికి ఇవ్వాలని పేర్కొన్నాడు. అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి చనిపోతే, అతని ఖాతాలో జమ చేసిన డబ్బులో 50 శాతం అతని భార్యకు, 25-25 శాతం అతని తల్లి సోదరికి లభిస్తుంది. వ్యక్తికి నామినీ లేనట్లయితే, అతని మరణం తర్వాత, అతని ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బు అతని చట్టబద్ధమైన వారసునికి అందుతుంది. నామినీ చేయని పక్షంలో, చాలా రకాల డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి.