Vehicle Mileage : ఒకప్పుడు అంటే ఏమో గానీ ఇప్పుడు చాలా వరకు అన్ని వర్గాల వారు టూవీలర్లు, కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు ఇవి కేవలం ధనికుల వద్ద మాత్రమే ఉండేవి. కానీ ఈఎంఐ సదుపాయం రావడంతో మధ్యతరగతి వారు కూడా ఈ వాహనాలను కొంటున్నారు. అయితే వాహనం కొనగానే కొందరు అది మైలేజ్ సరిగ్గా ఇవ్వడం లేదని వాపోతుంటారు. నిజానికి ఏ వాహనానికి అయినా నిర్దిష్టమైన మైలేజ్ ఉంటుంది. కనీసం ఆ మైలేజ్ కూడా రాకపోతే అలాంటప్పుడు కింద చెప్పిన విధంగా పలు సూచనలు పాటించాల్సి ఉంటుంది. దీంతో వాహన మైలేజ్ పెరుగుతుంది. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
టూవీలర్ లేదా కారు.. వాహనం ఏదైనా అందులో పరిమితికి మించి ప్రయాణం చేయరాదు. టూ వీలర్ అయితే ఇద్దరే వెళ్లాలి. ఇక కారు అయితే అందులో దాని సామర్థ్యాన్ని బట్టి వ్యక్తులు ప్రయాణం చేయాలి. అలా కాకుండా పరిమితికి మించి ప్రయాణిస్తే వాహనం మైలేజ్ ఇవ్వదు. ఈ విషయాన్ని ఎవరైనా కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. వాహనం టైర్లలో ఎప్పటికప్పుడు గాలిని చెక్ చేయించాలి. గాలి తక్కువ ఉన్నా వాహనం మైలేజ్ తగ్గుతుంది. అలాగే వాహనాన్ని నిర్ణీత సమయాల్లో సర్వీసింగ్ చేయిస్తూ ఉండాలి. దీంతో ఇంజిన్ పనితనం బాగుంటుంది. మైలేజ్ కూడా బాగా వస్తుంది.
ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఎవరైనా వాహనానికి సంబంధించిన యాక్సలరేటర్, క్లచ్, గేర్, బ్రేక్‌లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే అది సహజమే అయినప్పటికీ అవసరం లేకున్నా వాటిని వాడరాదు. వాడితే మైలేజ్ తగ్గుతుంది. వాహనం స్టార్ట్ చేశాక కొందరు చాలా దూరం వెళ్లి గానీ టాప్ గేర్‌లోకి మారరు. కానీ అలా చేయరాదు. వాహనం స్టార్ట్ చేసిన వెంటనే వీలైనంత త్వరగా టాప్ గేర్‌లోకి వెళ్లాలి. ఇలా చేస్తే మైలేజ్ పెరుగుతుంది. లేదంటే తగ్గుతుంది.
వాహనాన్ని మరీ స్పీడ్‌గా నడిపినా మైలేజ్ తగ్గుతుంది. కనుక నిర్ణీత స్పీడ్‌తో వెళితేనే మైలేజ్‌ను రాబట్టవచ్చు. కొండ నుంచి కింది ప్రాంతం వైపు దిగుతున్నప్పుడు, లేదా అలాంటి రోడ్లపై వాహనం వెళ్తున్నప్పుడు వాహన ఇంజిన్‌ను ఆఫ్ చేయాలి. అలాంటి ప్రదేశాల్లో ఎలాగూ ఇంజిన్ ఆన్‌లో లేకున్నా కిందకు వాహనం సులభంగా వెళ్తుంది. కనుక అలాంటి ప్రదేశాల్లో ఇంజిన్‌ను ఆఫ్ చేస్తే మైలేజ్ పెరుగుతుంది. ఇలా కొన్ని సూచనలను పాటించడం ద్వారా వాహనాల మైలేజీని పెంచుకోవచ్చు. దీంతో డబ్బు ఆదా అవుతుంది.