పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద బెనిఫిట్ షో ముందు తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందిన సంఘటన విదితమే. ఆమె కుమారుడు హాస్పిటల్‌లో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపై యావత్ సమాజం కన్నెర్ర చేసింది. థియేటర్ యాజమాన్యంతోపాటు అల్లు అర్జున్‌పైనా అనేక విమర్శలు వచ్చాయి. పోలీసులు ఓ వైపు వద్దని చెప్పినా అల్లు అర్జున్ ఎందుకు థియేటర్‌కు వెళ్లారంటూ అందరూ ప్రశ్నించారు. అయితే బాధితులకు అల్లు అర్జున్ సారీ చెప్పి రూ.25 లక్షలు నష్ట పరిహారం ప్రకటించారు. కానీ పోలీసులు మాత్రం తమ పని తాము చేసుకుపోయారు. అల్లు అర్జున్‌ను కాసేపటి క్రితం అరెస్టు చేశారు.
అల్లు అర్జున్‌పై చిక్కడపల్లి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 105, బీఎన్ఎస్ 118(1) రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీని ప్రకారం అల్లు అర్జున్‌కు 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఉస్మానియా హాస్పిటల్‌లో అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు.
కాగా అల్లు అర్జున్ అరెస్టు సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. పోలీసులు కనీసం తనకు డ్రెస్ మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదని, నేరుగా బెడ్ రూమ్‌లోకి వచ్చారని అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. మరో వైపు ఆయన తండ్రి అల్లు అరవింద్, సోదరుడు అల్లు శిరీష్‌లు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.