Warm Water : ఉదయం నిద్ర లేవగానే చాలా మంది టీ లేదా కాఫీలను తాగుతుంటారు. కానీ నిజానికి ఉదయం నిద్ర లేచిన వెంటనే టీ, కాఫీలకు బదులుగా నీళ్లను తాగాలి. అది కూడా.. గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఉదయం పరగడుపున 2 గ్లాసుల గోరు వెచ్చని నీళ్లను తాగుతుంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గోరు వెచ్చని నీళ్లను ఉదయం పరగడుపునే తాగడం వల్ల కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. గోరు వెచ్చని నీళ్లలో ఉండే వేడి నొప్పులను తగ్గించడంలో, కండరాలను శాంత పరచడంలో బాగా పనిచేస్తుంది. అందువల్ల నొప్పులు తగ్గుతాయి. మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు కూడా తగ్గిపోతాయి.
2. గోరు వెచ్చని నీళ్లను పరగడుపునే తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రం అవుతుంది. మలబద్దకం ఉండదు. సుఖ విరేచనం అవుతుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది. జీర్ణవ్యవస్థలో ఉండే వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు పోతాయి. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీని వల్ల హైబీపీ తగ్గుతుంది. అలాగే జుట్టు కుదుళ్లకు రక్త సరఫరా మెరుగు పడి శిరోజాలకు పోషకాలు లభిస్తాయి. దీంతో శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.
4. గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. పొడి చర్మం తేమగా మారుతుంది. చర్మం మృదువుగా ఉంటుంది.
5. గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. అధిక బరువు తగ్గేందుకు ఇది సహాయ పడుతుంది.
6. గోరు వెచ్చని నీళ్లను తాగితే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
7. గోరు వెచ్చని నీళ్లను తాగుతుంటే చర్మంలో ఉండే వ్యర్థాలు బయటకు పోతాయి. దీంతో మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.