Tortoise Ring : మనిషి ధరించే ఆభరణాల్లో ఉంగరం కూడా ఒకటి. అయితే ఉంగరం అనేది ఒక రకమైన ఆభరణం అయినప్పటికి జోతిష్య శాస్త్రంలో దీనిని వివిధ రకాల పరిహారాల కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు. జాతకం ప్రకారం ధరించే రత్నాలను ఉంగరంలో పదిల పరుస్తారు. ఇవి అలంకారానికి మాత్రమే కాదు శుభ ప్రదమైనవి కూడా. గ్రహ దోష నివారణలకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇందుకోసం జోతిష్య శాస్త్రం సూచించిన ఉంగరాలను వారి వారి జాతకాన్ని బట్టి ధరిస్తూ ఉంటారు. అయితే రత్నాలు, రాళ్ల ఉంగరాలనే కాకుండా తాబేళ్ల ఉంగరాలను కూడా ధరిస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలో తాబేలు ఉంగరానికి జోతిష్య శాస్త్రంలో ఉన్న ప్రత్యేకత.. ఈ ఉంగరాన్ని ధరించడం వల్ల కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తాబేలు లక్ష్మీదేవికి ప్రతీక. అమృతం కోసం సముద్రాన్ని మథనం చేసిన సమయంలో తాబేలు బయటపడిందని విశ్వసిస్తారు. తాబేలు ఏ రూపంలోనైనా ఇంట్లో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే తాబేలుని ఉంగర రూపంలో ఆభరణంగా ధరించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. తాబేలు డిజైన్ ఉన్న ఉంగరాన్ని ధరించేటప్పుడు, దానిని సరైన మార్గంలో ధరించాలి. ఈ ఉంగరాన్ని ధరించినప్పుడల్లా, తాబేలు తలను మీ వైపుకు తోక బయట వైపు ఉండేలా ధరించాలి. తాబేలు లక్ష్మీ దేవితో ముడిపడి ఉన్నందున శుక్రవారం తాబేలు ఉంగరాన్ని ధరించడానికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. తాబేలు ఉంగరాన్ని ఆభరణంగా ఉపయోగిస్తూ ఉంటే ఏ లోహంతో అయిన దీనిని తయారు చేయించుకోవచ్చు.
ఈ ఉంగరాన్ని ఆదృష్టం కోసం ఉపయోగించినట్లయితే వెండితో చేసిన తాబేలు ఉంగరాన్ని ధరిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఉంగరాన్ని ఏ వేలికి ధరిస్తారో చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ ఉంగరాన్ని ఉంగరపు వేలికి మాత్రమే ధరించాలని గుర్తుంచుకోండి. తాబేలు ఎలా నెమ్మదిగా వెళ్తూ తన గమ్యాన్ని చేరుకుంటుందో అదే విధంగా ప్రతిరోజూ నెమ్మది నెమ్మదిగా పురోగతి సాధిస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. కనుక ఈ ఉంగరం వ్యక్తి పురోగతికి ఖచ్చితంగా దోహదపడుతుందని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.