రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల్లో ఒకరు. ఈయనకు ఇద్దరు కుమారులు ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ ఉన్నారు. ఒక కుమార్తె ఇషా అంబానీ కూడా ఉంది. ఈమధ్యనే అనంత్ అంబానీకి ఘనంగా వివాహం కూడా జరిపించారు. అయితే అనంత్ అంబానీని కొందరు ఇప్పటికీ ట్రోల్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఆయనపై జోకులు కూడా వేస్తుంటారు. కానీ అనంత్ అంబానీ గురించి ఈ విషయాలు తెలిస్తే ఎవరూ ఇకపై ఆయన గురించి జోకులు వేయరు.
అనంత్ అంబానీకి మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండదని అంటుంటారు. కానీ ఆయన అనేక పనులు చేస్తున్నారన్న విషయం చాలా మందికి తెలియదు. అనంత్ అంబానీ బద్రీనాథ్ కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒక డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు సహ ఓనర్‌గా వ్యవహరిస్తున్నారు. వంతారా వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్ ప్రాజెక్టును ప్రారంభించి వన్య ప్రాణుల సంరక్షణకు పాటు పడుతున్నారు.
అనంత్ అంబానీకి చిన్న తనం నుంచే తీవ్రమైన ఆస్తమా సమస్య ఉంది. దీంతో డాక్టర్లు ఆయనకు పవర్‌ఫుల్ మెడిసిన్లను ఇస్తున్నారు. అందువల్లే ఆయన అలా విపరీతంగా బరువు పెరుగుతున్నారు. ఒకానొక సందర్భంలో అనంత్ 100 కిలోల బరువు తగ్గారు. కానీ ఆయన వాడుతున్న మెడిసిన్ వల్ల మళ్లీ బరువు పెరిగారు. ఇలా అనంత్ అంబానీ జీవితం కొనసాగుతోంది. అయితే ఆయన గురించి వివరాలు తెలియని వారు ఆయనకు మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉండదని అంటున్నారు, కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు.