ఏయేటి కాయేడు వస్తువుల ధరలు పెరుగుతూనే ఉంటాయి. పూర్వం ఒకప్పుడు కొన్ని రూపాయలు ఇస్తే బంగారం వచ్చేది. పెట్రోల్ కూడా తక్కువ ధరకు లభించేది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. జనాభా పెరుగుతున్న కొద్దీ వారి అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలను కల్పించాలన్నా, వస్తువులను తయారు చేయాలన్నా అధికంగా ఖర్చవుతుంది. అందుకనే అన్ని వస్తువుల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతుంటాయి.ఇక 1960లలో పలు రకాల వస్తువుల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరిశీలిద్దాం.
కింద ఇచ్చిన చిత్రంలో వెస్పా స్కూటర్ ధర ఎంతో చూశారా..? ఇది 1961 కాలం నాటి బిల్లు. స్కూటర్ మొత్తం ఆన్‌రోడ్ ధర రూ.2243 మాత్రమే. కానీ ఇప్పుడు మాత్రం ఆ ధరకు స్కూటర్ టైర్ కూడా రావడం లేదు. ఇక ఆ రోజుల్లో ఫియట్ కారు ధర రూ.5వేలుగా ఉండేది. లీటర్ పెట్రోల్‌ను 78 పైసలకు విక్రయించే వారు. బర్కిలీ అనే కంపెనీకి చెందిన సిగరెట్ ప్యాకెట్ ధర 31 పైసలుగా ఉండేది. మసాలా దోశ ధర 12 పైసలు మాత్రమే. పానీ పూరీ ధర కూడా 12 పైసలే.
అప్పట్లో కార్పొరేట్ స్కూల్‌లో ఫీజు నెలకు రూ.12 తీసుకునే వారు. ఇక అపార్ట్‌మెంట్‌లో 1 బెడ్‌రూమ్ ఫ్లాట్ ధర రూ.19వేలుగా ఉండేది. 1970లలో కేవలం ఇండియన్ ఎయిర్ లైన్స్ మాత్రమే ఉండేది. అప్పట్లో విమాన టిక్కెట్టు ధర రూ.70గా ఉండేది. అలాగే ట్రెయిన్‌లో రిజర్వేషన్ టిక్కెట్ ధర రూ.18గా ఉండేది. సైకిల్‌ను ఒక గంటపాటు అద్దెకు తీసుకుంటే 25 పైసలు తీసుకునే వారు. ఇలా అప్పట్లో ఆయా వస్తువుల ధరలు చాలా తక్కువగా ఉండేవని చెప్పవచ్చు. కానీ ఆ కాలంలో అవే ఎక్కువ ధరలు. ఈ ధరలు చూశాక ఎంచక్కా ఆ కాలానికి వెళ్లే సదుపాయం ఉంటే బాగుండును అనిపిస్తుంది కదా.