తెలంగాణ లాభపడింది. చాలా ఎక్కువ లాభపడింది, విడిపోయాక తెలంగాణ ధనిక రాష్ట్రం. తెలంగాణ తన అస్తిత్వాన్ని రొమ్ము విరుచుకుని లేచి నిలబడింది, ఆర్థికంగానే కాదు సాంస్కృతికంగా, సంస్కృతి పరంగా తను ఇప్పుడు నిఠారుగా నిలబడింది. తన గడ్డమీద తనని తనయాసని అవహేళన చేస్తుంటే అప్పుడు గుడ్లప్పగించి చూసింది, ఇప్పుడు నా యాసని కించపరచండి రా మీ సంగతి చెప్తా అంటుంది. సినిమా వాళ్లు తెలంగాణ భాషని రౌడీలు, గుండాలు, కమెడియన్లు పాత్రలకు వాడితే, ఇప్పుడది హీరో భాష అయింది, తెలంగాణ యాస ఇప్పుడు తీయని తెలుగు భాషగా మారింది అది చాలదా. ఇక ఇప్పుడు తెలంగాణ పల్లెలు ఆంధ్ర పల్లెలాగా పచ్చగా కళకళలడుతున్నాయి.
పాలమూరు/ మహబూబ్‌నగర్ అనే జిల్లా తాగునీరు, సాగునీరు లేక ఎడారిని తలపిస్తూ ఉండేది, అసలు ఇంకో వంద సంవత్సరాలకైనా మహబూబ్‌నగర్ అనే ఈ జిల్లా నీళ్లకు నోచుకుంటుందా అని ఆ జిల్లా జనం దుఃఖించేవారు, ఇవ్వాళా అదే పాలమూరు జిల్లా పచ్చటి కోనసీమను తలపిస్తుంది. ప్రపంచ స్థాయి నగరం హైద్రాబాద్ తెలంగాణకు దఖలు పడింది, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 24 జిల్లాలకు ఆదాయాలను ఇప్పుడు 10 జిల్లాలకి కేటాయించడం జరిగింది, 24 జిల్లాలకు పంచిన రాబడి నేడు 10 జిల్లాలకు వచ్చినట్లే కదా! హైదరాబాద్ ఆదాయంలో మరొకరితో పొత్తు లేదు, దీంట్లో ఎవరికీ వాటా లేదు.
ఇక్కడ ఆర్థిక లాభం కంటే నిరుద్యోగుల, విద్యార్థుల కొలువుల కొట్లాటగా చూడాలీ. విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, ఉద్యోగులు తెలంగాణ ఉద్యమానికి కారణం. 2009 వరకు వీళ్లు మాత్రమే కలబడ్డారు, 2009 తర్వాత సకలజనులను ఉద్యమంలోకి తేగలిగారు. సబ్బండవర్ణాలు నిర్విరామంగా రోడ్లపై కొచ్చి ఉద్యమం చేశాయి, 1969 లో హైదరాబాద్, జిల్లా, పట్టణ కేంద్రాలకు మాత్రమే పరిమితమైన తెలంగాణా ఉద్యమం 2009 తర్వాత పల్లెను తాకింది, పల్లె గళమెత్తింది, వ్యాపారులు బంద్ అంటే విసుక్కుంటారు కానీ స్వచ్ఛందంగా వారే JAC పిలుపుతో బంద్ చేశారు. ఆర్టీసీబస్ లు 60 రోజులు తిరగలేదు, రెండు నెలలు నిర్విరామంగా ప్రభుత్వ ఆఫీసులు పనిచేయలేదు.
ఆర్థిక ప్రయోజనాలు పక్కన పెడితే తెలంగాణా ఆత్మగౌరవం దక్కింది. హైదరాబాద్ ఆదాయం అంతా తెలంగాణకే మరి అటువంటిప్పుడు లాభ పడింది తెలంగాణయే కదా. విడిపోయిన తరువాత కష్టాలు ఎవరికో నష్టం ఎవరికో మీరే తేల్చుకోండి. అంతటి అభివృద్ధి రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగింది, ఒక మాట చెప్పాలంటే విడిపోకముందు విడిపోయిన తర్వాత తెలంగాణ స్వభావ స్వరూపాలే మారిపోయాయి. విడిపోయినందుకు తెలంగాణా అత్యంత లాభపడింది. ఆత్మగౌరపరంగా, అభివృద్ధి పరంగా తెలంగాణ లాభపడింది. కానీ ఏపీ మాత్రం తీవ్రంగా నష్టపోయింది.