మీరు కుటుంబంతో కారులో సుదూర పర్యటనపై బయల్దేరారు. 400కిమీలు ప్రయాణించాక బడలికతో ముందుగా అనుకోని, మీకు అసలు తెలియని ఊరిలో ఆగవలసి వచ్చింది. అక్కడ బస చెయ్యాలంటే ఊరిలోకి వెళ్ళి మంచి హోటల్ వెతుక్కోవాలి. అలా కాక హైవేపైనే విశాల ప్రాంగణంలో, కార్లు పెట్టుకునేందుకు సరిపడా ఖాళీ స్థలంతో ఒక హోటల్ ఉంటే సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఇలాంటి హోటలునే మోటల్ అంటారు – మోటరిస్టుల హోటల్ (MOTorists’ hotEL).
మోటళ్ళు ప్రథమంగా అమెరికా, కెనడాలో మొదలయ్యాయి. రెండూ విశాలమైన దేశాలు. దూరంగా ఉన్న ఊరికి కారులో వెళ్ళాలంటే దారిలో ఎన్నో ఊర్లు దాటవలసి ఉంటుంది. ప్రతి ఊరిలో తగిన బడ్జెట్లో హోటళ్ళు వెతుక్కుని అక్కడకు వెళ్ళాలంటే మొత్తంగా ఎంతో సమయం వృధా. అలాంటి ప్రయాణికులకు అనుకూలంగా ఉండేందుకు హైవేలపై ఈ మోటల్స్ వెలిసాయి. పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా విశాలమైన ప్రాంగణంతో శుభ్రమైన గదులతో ఊరిలోని హోటళ్ళ కంటే తక్కువ ధరలకు గదులను అద్దెకిస్తారు మోటల్స్‌లో.
హోటళ్ళతో పోలిస్తే మోటళ్ళలో మితమైన సౌకర్యాలుంటాయి. కానీ ప్రయాణికులకు ఒక రోజు లేదా రాత్రి బడలిక తీర్చుకునేందుకు అవసరమైన సౌకర్యాలన్నీ ఉంటాయి. ఉదాహరణకు శుభ్రమైన గదులు, తాగునీరు, పార్కింగ్ స్థలం వంటి కనీస సౌకర్యాలుంటాయి కానీ ఈతకొలను, జిమ్, రెస్టారెంట్, బార్ వంటి విలాసాలు సాధారణంగా ఉండవు. అందువల్ల తక్కువ ధరకే గదులు అద్దెకు దొరుకుతాయి.