ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్‌పై భారత్ చేసిన యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే వందల మంది ఉగ్రవాదాలను హతమార్చామని భారత్ తెలియజేసింది. ఇక ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఇండియా మాత్రం ఆయన వాదనను ఖండిస్తోంది. భారత్, పాక్ మధ్య మూడో దేశం ప్రమేయం అవసరం లేదని, తమ సమస్యను తాము పరిష్కరించుకుంటామని తేల్చి చెప్పేసింది. అయితే పాకిస్థాన్‌కు 5వ జనరేషన్ ఫైటర్ జెట్స్‌ను చైనా సరఫరా చేస్తోంది. దీంతో భారత్ ఏం చేస్తుందనే విషయంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.
భారత్ 5వ జనరేషన్ ఫైటర్ జెట్స్ కోసం అమెరికా, రష్యాలపై ఆధారపడుతుందని అంటున్నారు. అమెరికాకు చెందిన ఎఫ్35 లేదా రష్యాకు చెందిన సు-57ఇ ఫైటర్ జెట్స్‌ను భారత్ కొనుగోలు చేస్తుందని చెబుతున్నారు. కానీ రష్యాతో ఇప్పటికే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, బ్రహ్మోస్ కలిసి రూపొందిస్తున్న భారత్ ఆ దేశం నుంచే ఫైటర్ జెట్స్‌ను కొనుగోలు చేస్తుందని కూడా అంటున్నారు. రష్యా దీనిపై ఇప్పటికే టెక్నాలజీని అందించేందుకు కూడా సిద్ధంగా ఉండడం మరొక కారణం. ఈ క్రమంలోనే త్వరలోనే భారత్‌కు రష్యాకు చెందిన 5వ తరం ఫైటర్ జెట్స్ వస్తాయని అంటున్నారు.
అయితే అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలకు పోటీగా భారత్ కూడా ప్రస్తుతం 4.5వ తరం ఫైటర్ జెట్స్‌ను అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగానే డీఆర్‌డీవో, హెచ్ఏఎల్ సంస్థలకు తేజస్ ఎంకే1ఎ ఫైటర్ జెట్స్‌ను తయారు చేసే పనిని అప్పగించింది. అయితే ఈ ఫైటర్ జెట్స్‌కు గాను ప్రస్తుతం ఇంజిన్ల కొరత ఏర్పడింది. దీంతో ఈ ఫైటర్ జెట్స్‌ను రూపొందించి అందించేందుకు మరో 16 నెలలు పడుతుందని అంటున్నారు. ఇక ఇప్పటికే తేజస్ ఫైటర్ జెట్స్ కోసం హెచ్ఏఎల్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.67వేల కోట్ల డీల్‌ను ఇచ్చింది. ఇందులో భాగంగా 97 జెట్స్‌ను తయారు చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు ఇవ్వనున్నారు. ఈ విధంగా భారత్ కూడా పాకిస్థాన్‌పై ఫైటర్ జెట్స్ విషయంలో పైచేయి సాధిస్తోంది.