భార్యను చంపాడని భర్తకు జైలుశిక్ష! ఒక సంవత్సరం 8 నెలలు జైలులో గడిపాక భార్య బ్రతికే ఉందని బయట పడింది!! అసలేం జరిగింది. భర్త తన సొంత భార్యను హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు. దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు జైలులో గడిపిన తర్వాత, అతను తన భార్య బతికే ఉందని తెలుసుకున్నాడు. భార్యను చంపినందుకు భర్త 2 ఏళ్లుగా జైలులో ఉన్నాడు. ఒకరోజు ఆమె ప్రేమికుడితో కలిసి హోటల్‌కు వెళుతుండగా ఓ స్నేహితుడు చూశాడు! నేను ఏ నేరం చేయలేదు, అయినప్పటికీ నేను రెండేళ్లు జైలులో గడపాల్సి వచ్చింది. నా నుదిటిపై తప్పుడు కళంకం పెట్టారు, నా గౌరవం దెబ్బతింది, సమాజం నన్ను ద్వేషంతో చూసింది. ప్రభుత్వం నాకు రూ. 5 కోట్ల పరిహారం ఇవ్వాలి. తప్పు చేసి నా జీవితాన్ని నాశనం చేసిన పోలీసు అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి.. తన భార్యను చంపాడనే తప్పుడు ఆరోపణపై 1 సంవత్సరం 8 నెలలు జైలులో గడపవలసి వచ్చిన కురుబర సురేష్ మాటలు ఇవి!
2020 సంవత్సరంలో కర్ణాటకలోని మైసూర్‌లో నివసించే కురుబర సురేష్ భార్య మల్లిగే అకస్మాత్తుగా అదృశ్యమవడంతో కథ ప్రారంభమవుతుంది. సురేష్ తన భార్య కోసం చాలా వెతికాడు, కానీ ఆమె కనిపించకపోవడంతో, అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మల్లిగే కోసం వెతకడం ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత, బేతార్‌పుర ప్రాంతంలో ఒక మహిళ అస్థిపంజరం కనిపిచింది. సమగ్ర దర్యాప్తు నిర్వహించకుండానే, ఆ అస్థిపంజరం మల్లిగేదేనని భావించి, సురేష్‌ను అరెస్టు చేసి, ఆమె హత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. పోలీసులు అస్థిపంజరాన్ని DNA పరీక్ష కోసం పంపి, మల్లిగే తల్లి నుండి రక్త నమూనాలను తీసుకున్నారు, కానీ DNA నివేదిక రాకముందే, పోలీసులు తొందర పడి కోర్టులో తుది ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. ఛార్జిషీట్‌లో, మల్లిగేను ఆమె భర్త సురేష్ హత్య చేశాడని పోలీసులు పేర్కొన్నారు. తరువాత, DNA పరీక్ష నివేదిక వచ్చింది, ఇది అస్థిపంజరం మల్లిగేది కాదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, పోలీసులు తమ వైఖరికి కట్టుబడి ఉన్నారు. సురేష్‌ను జైలులో ఉంచారు.
మల్లిగే తల్లి , గ్రామస్తుల వాంగ్మూలం తీసుకోవాలని పోలీసులను కోరారు. కోర్టులో, అందరు సాక్షులు మల్లిగే బతికే ఉందని , ఆమె ఎవరితోనో పారిపోయిందని ఒకే మాట చెప్పారు. కోర్టు పోలీసు చార్జిషీట్‌ను కొట్టివేసింది. మల్లిగే అస్థిపంజరం కనిపించలేదని, DNA పరీక్షలో కూడా ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంటూ సురేష్ కోర్టులో డిశ్చార్జ్ దరఖాస్తు దాఖలు చేశాడు. కానీ కోర్టు ఈ దరఖాస్తును తిరస్కరించి ప్రశ్నలు లేవనెత్తింది, కానీ పోలీసులు ఆ అస్థిపంజరం మల్లిగేదేనని, హత్య సురేష్ చేశాడని దృఢంగా తేల్చుకున్నారు. అందువలన, సురేష్ ఎటువంటి బలమైన ఆధారాలు లేకుండా 20 నెలలు జైలులో గడపాల్సి వచ్చింది. అయితే తర్వాత కేసు పెద్ద మలుపు తిరిగింది . సురేష్ స్నేహితుడు అతని భార్యను తన ప్రియుడితో కలిసి హోటల్‌కు వెళ్లడాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మల్లిగేను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మల్లిగే బతికే ఉందని స్పష్టమైంది. పోలీసుల నిర్లక్ష్యాన్ని చూసిన కోర్టు సురేష్‌ను గౌరవంగా నిర్దోషిగా ప్రకటించింది. అలాగే, సురేష్‌కు లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని హోం శాఖను ఆదేశించింది. ఈ తప్పుడు దర్యాప్తుకు కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు పేర్కొంది.
20 నెలలు జైలులో గడిపిన ఈ జీవితం తన గౌరవాన్ని, సామాజిక స్థితిని పూర్తిగా నాశనం చేసిందని సురేష్ చెబుతున్నాడు. సురేష్ బాధతో పోలిస్తే,అతనికి లక్ష రూపాయల పరిహారం ఏమీ కాదు. తన జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి అతను రూ.5 కోట్ల పరిహారం డిమాండ్ చేస్తున్నాడు. అలాగే, తన జీవితాన్ని నాశనం అయ్యేందుకు తప్పుడు దర్యాప్తు తో కారణమైన పోలీసు అధికారులను శిక్షించాలని అతను కోరుకుంటున్నాడు.